పెద్దపల్లి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): గోదావరి తల్లి కన్నీటి గోస పేరుతో మహా పాదయాత్ర చేపట్టామని.. కేసీఆర్ కాళేశ్వరం ధర్మ సంకల్పమే తనను ప్రతీ అడుగు వేయించిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రామగుండంలోని గోదావరిఖని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఎప్పుడూ నిండు కుండలా ఉండే గోదావరి తీరం కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనలో అడుగంటి పోవడంతోనే స్థానిక తెలంగాణ ఉద్యమ కారులు బొడ్డు రవీందర్, ఉప్పు రాజ్‌కుమార్, ముద్దసాని సంధ్యారెడ్డి పాదయాత్రకు ప్రణాళికలను సిద్ధం చేసి తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా.. వెంటనే స్పందించి వారి ఆలోచనకు అనుగుణంగా మహాపాదయాత్రను చేపట్టామన్నారు. ఈ నెల 17న గోదావరిఖని గోదావరి తీరం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు తమ వెంట పాదం కదిపారన్నారు.
ముఖ్యంగా మహిళలు తన వెంట 198కిలో మీటర్లను నడవటం నిజంగా తనలో నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. పాదయాత్రగా బయలు దేరిన తమకు గ్రామ గ్రామాన ప్రజలు ఘనంగా స్వాగతాలు పలికి ఆహ్వానించారని, సాగు నీటికి, తాగునీటికి వారు పడుతున్న ఇబ్బందులను వివరించి తమను సన్మానిస్తూ.. సత్కరిస్తూ కేసీఆర్‌ను కీర్తిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెడుతూ ముందుకు నడిపించారన్నారు. సాగు నీటి కష్టాలను రైతులు వివరిస్తుంటే చాలా చోట్ల తనకూ కన్నీళ్లు ఆగలేదన్నారు. కాళేశ్వరాన్ని రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుండా.. రైతులను గోస పెడుతున్నారని, కేవలం బీఆర్ఎస్పై కక్షతోనే గోదావరిని ఎండబెట్టి పాపం మూటగట్టుకుంటున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లు సముద్రంలోకి వదలడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటాయని, ఇటు రైతులకు సాగునీరు అటు ప్రజలకు తాగునీరు, పశు పక్షాదులు జీవకోటికి గుక్కెడునీళ్లు లేకుండా చేశారన్నారు.
ఎక్కడ చూసినా కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు ఘోరంగా తిడుతున్నారని ఆయన తెలిపారు. ఆరు రోజులు పాటు తన వెంట పాదయాత్రగా నడిచిన బొడ్డు రవీందర్, ఉప్పు రాజ్‌కుమార్, ముద్దసాని సంధ్యారెడ్డి, గురం పద్మ, కల్వచర్ల కృష్ణవేణి, పెంట రాజేశ్, పాముకుంట్ల భాస్కర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజు, కౌటం బాబు, బండారి ప్రవీన్, ఆర్శనపల్లి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, బచ్చాల రాములు, ఇరుగురాళ్ల శ్రావణ్, బుర్ర వెంకన్న, ఆవునూరి వెంకటేశ్, వెన్నం రవీందర్, నారాయణదాసు మారుతి, పల్లె మధు, కడమంచి శివ, రేబెల్లి సాగర్, రామరాజు, కిరన్జీ, బొడ్డుపల్లి శ్రీనివాస్, రాజేశ్, మేడి సదానందం, కిషన్‌రెడ్డి, గాదె అంజలి పాదయాత్ర చేసిన మరో వంద మందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తమ పాదయాత్రలో ప్రధానంగా కాళేశ్వరం అంటే ఒక్క కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్ కాదని, మూడు బ్యారేజీలు, 15రిజర్వాయర్లు, 19సబ్ స్టేషన్లు, 21పంపు హౌస్‌లు, 200 కిలో మీటర్ల సొరంగాలు, 1530కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98కిలో మీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల కెపాసిటీ ఉన్న 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతలు, 240 టీఎంసీల నీటి ఉపయోగంతో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించారనే విషయాన్ని ప్రజలకు వివరించామన్నారు.
ఆ దేవుడి దీవెనలు, కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజలిచ్చిన బలమే.. కాళేశ్వరం ప్రాజెక్టును కోరుతున్న దైవానుగ్రహమే 198కిలో మీటర్ల దూరంను తమను నడిపించిందన్నారు. తమ పాదయాత్రకు అండగా నిలిచిన పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత, హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా నాయకులు పుట్ట మధూకర్, దాసరి మనోహర్‌రెడ్డి, మూల విజయరెడ్డి, చిరుమల్ల రాకేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, గంటా రాములు, ఆముల నారాయణ, తగరం శంకర్‌లాల్, దాసరి ఉషా, గోపు ఐలయ్య, మురళీధర్‌రావు, పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆరు రోజుల పాదయాత్ర సందర్భంగా తమలో ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని, అడుగడుగునా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పలికిన అపూర్వ స్వాగతం పలికారని.. వారిని ఎన్నటికీ మరువలేమన్నారు. వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.