ధర్మారం, అక్టోబర్ 26 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దగా చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆదివారం తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. గత యాసంగి సీజన్లో పండించిన సన్న వరి ధాన్యానికి ఇంతవరకు బోనస్ ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న రైతులకు చేసిన ప్రయోజనం ఏమిటని ఆయన నిలదీశారు.
రైతులకు బోనస్ చెల్లించకుండా అన్యాయం చేస్తుంటే వారు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ధాన్యం కోత విధిస్తున్నారని ప్రశ్నించిన ప్రస్తుత మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్యం తూకంలో కోత విధిస్తున్నారని దీనికి ఆయన ఏం సమాధానం చెబుతాడని మాజీ మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో రైతుల నుంచి కిలో ధాన్యం కోత విధిస్తే సహించబోమని రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి ఈశ్వర్ హెచ్చరించారు.