కోల్ సిటీ, మార్చి 26: పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌కు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆరోపించారు. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయానికి వస్తే అధికార పార్టీనా? ప్రతిపక్ష పార్టీనా అని అధికారులు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే వారికి అధికార పార్టీ కార్యకర్త అయితేనే ఫలానా డివిజన్ లోని ఎలాంటి సమస్యలైన పరిష్కారం చేస్తామని చెప్పడం దారుణమన్నారు.
ప్రజలు తమ సమస్యలు అధికారులకు విన్నవించేందుకు కార్యాలయానికి వస్తే అధికార పార్టీకి చెందిన నాయకులు గంటల తరబడి కమిషనర్ చాంబర్, ఇతర అధికారుల చాంబర్లో సరదా ముచ్చట్లు చెబుతూ వ్యంగ్యస్త్రాలతో సామాన్య ప్రజలను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాజా మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు వచ్చిన సమయంలో కూడా కార్యాలయంలో ఉన్న అధికారులు కూడా ఇదే విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం పరిపాలన వ్యవస్థ పై ప్రత్యేక నిఘా పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.