Korutla | కోరుట్ల, ఫిబ్రవరి 26 : గతంలో కిడ్నీ సంబంధిత బాధితులు డయాలసిస్ చేయించుకునేందుకు నరకం చూడాల్సి వచ్చేది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఒక్కో సిట్టింగ్‌కు వేలకు వేలు వెచ్చించాల్సిన దయనీయస్థితిని ఎదుర్కొనేది. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర సర్కారు వీరి బాధలను తొలగిస్తున్నది. నియోజకవర్గానికో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారం, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కృషితో కోరుట్లలో సెంటర్ ఏర్పాటైంది. గత నెల 5న ఈ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించగా, పూర్తిస్థాయి సౌకర్యాలతో డయాలసిస్ కేంద్రం సేవలను అందిస్తున్నది. ఇక్కడ ఐదు పడకలు ఉండగా, హీమోడయాలసిస్ పద్ధతి ద్వారా ఒకేసారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు ఐదు మిషన్లను ఏర్పాటు చేశారు.
ట్యూమింగ్ మిషన్, ఈసీజీ గ్రాఫిక్స్, మల్టీపారమౌస్, ట్యూబింగ్స్, డయాలైజర్ వంటి పరికరాలను రక్తశుద్ధి కోసం వినియోగిస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి డివిజన్లోని మల్లాపూర్, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మండలాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం 48 మంది కిడ్నీ రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి నాలుగు షిప్ట్‌ల ద్వారా ఒక్కో పేషెంట్‌కు నాలుగు గంటల పాటు సేవలందిస్తున్నారు. పేషెంట్ ఇబ్బంది పడకుండా ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అలాగే హెచ్ఐవీ బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాన్ని కేటాయించారు.
ఒక్కో పేషెంట్‌పై 18వేలకుపైగా ఖర్చు
ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో పేషెంట్‌కు నెలలో పది సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం సేవలను ఉచితంగా అందిస్తున్నది. అయితే ఒక్కో పేషెంట్‌పై ప్రభుత్వం నెలకు 18,200 వరకు వెచ్చిస్తున్నది. వీరికి 2016 పింఛన్ ఇవ్వడంతోపాటు ఉచిత బస్‌పాస్‌లను కూడా అందిస్తున్నది. ఎక్కడికో వెళ్లాల్సిన బాధలు తప్పినయ్నేను మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న. రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం వేల రూపాయలు ఖర్చయినయ్. చికిత్స కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో చాలా ఇబ్బందయ్యేది. ప్రభుత్వం కోరుట్లలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో ఎక్కడికో వెళ్లాల్సిన బాధలు తప్పినయ్. ఇప్పటికే ఇక్కడ పది సార్లు డయాలసిస్ చేసుకున్న. కార్పొరేట్‌కు దీటుగా మంచి సేవలు అందిస్తున్నరు. బతుకుపై అశలు చిగురించినయ్.
– తిరుపతి, కిడ్నీ బాధితుడు, ముత్యంపేట (మల్లాపూర్ మండలం)
సద్వినియోగం చేసుకోవాలి
శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించే ప్రక్రియ డయాలసిస్. మూత్రపిండాలు రక్తాన్ని తగినంతగా ఫిల్టర్ చేయనప్పుడు డయాలసిస్ అవసరమవుతున్నది. డయాలసిస్ మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఉత్పాదక జీవితాన్ని గడిపేందుకు అవకాశం కల్పిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం హీమోడయాలసిస్ విధానంతో రోగులకు చికిత్సను అందిస్తున్నాం.
– వేముల సునీతరాణి, సూపరింటెండెంట్ (కోరుట్ల ఏరియా దవాఖాన)
నిరంతర సేవలు
కోరుట్లలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిరంతర సేవలు అందిస్తున్నాం. నాలుగు గంటల పాటు పేషెంట్‌కు డయాలసిస్ అందించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. డయాలసిస్ పేషెంట్లకు సింగిల్ యూజ్ వస్తువులతో చికిత్స అందించాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మోటివేషన్, డైట్ ఫాలోయింగ్, ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తాం. పేషెంట్ కేర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మూడు షిఫ్ట్‌ల ద్వారా రోజుకు 16 మంది పేషెంట్లకు డయాలసిస్ చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఒక డయాలసిస్ మిషన్ 8 లక్షల వరకు ఉంటుంది. ప్రతి పేషెంట్‌కు ఒకసారి డయాలసిస్ చేసేందుకు ప్రభుత్వం 6 వేల వరకు వెచ్చిస్తున్నది.
– తెడ్డు రామకృష్ణ, డయాలసిస్ సెంటర్ పర్యవేక్షకుడు, సీనియర్ టెక్నీషియన్