పెద్దపల్లి, నవంబర్18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైఖరితో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోల్లు బంద్ కావటంతో చేసేది ఏమీ లేక పత్తి రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు అందోళన వ్యక్తం చేశారు. రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడ కొరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్ మండిపడ్డారు. ఆంక్షలు లేకుండా మద్దతు ధరలో పత్తి వెంటనే కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో ఏనాడు కూడా రైతులకు నష్టం చేసే విధంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకుందామంటే కొనునాధుడు లేక రైతన్న పడుడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పత్తిని విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకోని కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చలనే ఉద్దేశంతో లేనిపోని నిబంధనలతో ఇక్కడి పత్తి రైతులను ఆర్ధికంగా నష్ట చేసే కుట్రులు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో 28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచన వేస్తే ఇప్పటి వరకు కొన్నది కేవలం 1.25 లక్షల మెట్రిక్ టన్నులే అని వివరించారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 నిబంధనలు, ఎకరాలకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితి ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటుంటే 8 మంది బీజేపీ ఎంపీలు, మరో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, ఉప్పు రాజ్ కుమార్, సతీష్ గౌడ్‌తో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.