ధర్మారం, మార్చి 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ(SRSP) కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్మారం రైతులు ఆందోళన చేపట్టారు. యాసాంగిలో సాగు చేసిన వరి పొలాలు ఎండుతుండటంతో ఆక్రోశించిన రైతులు కాలువ తూమును ఎత్తి కాలువ నీటిని విడుదల చేశారు. కుంటల కింద సాగుచేసిన పొలాలకు నీటిని ఇచ్చే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ తిరిగి ఆ తూమును పోలీసు బందోబస్తు మధ్య మూసివేసి నీటి సరఫరాను ఆపివేశారు. వివరాలలోకి వెళ్తే.. మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ డి83/బి కాల్వకు ఉన్న తూము నుంచి గత దశాబ్దాలుగా ధర్మారం మండల కేంద్రంలోని ఊరకుంట చెరువులోకి కాలువ నీటి సరఫరా జరుగుతుంది.
దీంతో రైతులు ప్రతి ఏటా ఆ కాలువ నీటిపై ఆధారపడి ఊరకుంట కాళ్ల కింద రైతులు సుమారు 50 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏసన్న కూడా రైతులు కుంట కింద పొలాలు సాగు చేశారు. ఈ కుంటలోకి వచ్చిన కాలువ నీటితో రైతులు పొలాలను పారించుకుం టున్నారు. అయితే ఈ కుంటలోకి ఎర్రగుంటపల్లి శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ కాలువ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో కుంటలో నీటిమట్టం బాగా తగ్గిపోయింది. దీంతో పొట్ట దశలో ఉన్న వరి పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఎస్సారెస్పీ కాలువ తూమును ఎత్తి నీటిని విడుదల చేశారు.
సమాచారం తెలుసుకున్న నీటిపారుదల శాఖ ఏఈ, లస్కర్ అక్కడకు చేరుకొని ఎస్సారెస్పీ నీటిని కుంటల కింద సాగు చేసిన పొలాలకు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. మరోసారి నీటిని తుమ్ము నుంచి విడుదల చేస్తే రైతులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఆవుల శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. నీటిని సరఫరా చేయని పక్షంలో తామంతా కలిసి రాస్తారోకో చేస్తామని రైతులు హెచ్చరించారు.