100 years Grandmother | సుల్తానాబాద్, రూరల్, మే 19 : పైఫొటోలో చివరలో నిల్చున్న ఆమె పేరు ఎర్రం వెంకటమ్మ. చాలా చురుకుగా కనిపిస్తూ తన కొడుకులు, కూతుళ్లు, మనవళ్లతో కలిసి సరదా సమయాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతకీ ఇందులో ప్రత్యేకత ఏముందంటారా..? పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాశి పల్లి గ్రామానికి చెందిన ఎర్రం వెంకటమ్మ వయసు వంద సంవత్సరాలు ఉంటుంది. ఈ బామ్మ ఒకటి, రెండు, మూడు కాదు.. ఏకంగా నాలుగు తరాల వారసులతో కలిసి సందడి చేసి వార్తల్లో నిలిచింది.
ఈ తరం యువత చిన్న చిన్న పనులకు అలసిపోతున్న తరుణంలో ఈ శతాధిక వృద్ధురాలు మాత్రం తన పనులను తానే చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వెంకటమ్మ నాలుగో తరం మునిమనవలతో కలిసి సరదాగా కలిపి గడపడం చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటమ్మ ఈ వయస్సులో కూడా ఎవరి సహాయం కోరకుండా తన పనులను తానే చేసుకుంటుండం విశేషం. వెంకటమ్మ సంతానం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వాళ్లందరూ ఆదివారం గ్రామానికి వచ్చారు.
గ్రామ శివారులోని వ్యవసాయ పంట పొలాల వద్ద ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటమ్మ తన బిడ్డలతోపాటు కొడుకులు, మునిమనవలతో కలిసి సరదా గడిపింది. ఈ కార్యక్రమంలో కూతుర్లు సత్తమ్మ, భాగ్యమ్మ, విజయ, మనుమలు, మనమరాలు, దాసరి మధుసూదన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అజయ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శశికాంత్ రెడ్డి ,హారిక, పద్మ ,రజిత, స్వప్నలతోపాటు తదితరులున్నారు.