Singareni | యైటింక్లెయిన్ కాలనీ, డిసెంబర్ 30: సింగరేణి సంస్థ మనుగడను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నదని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. మంగళవారం రామగుండం-2 ఏరియా వకీల్ పల్లి గనిపై జరిగిన గేట్ మీటింగ్‌లో ప్రధాన కార్యదర్శి సారంగపాణితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
నవరత్న సంస్థలలో ఒకటై 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనుగడపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు వ్యవహరించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. జెన్కో పేరుతో ప్రైవేట్ సంస్థలకు మణుగూరు పీకే ఓసీ-2, డిప్ ఎక్స్ టెన్షన్ బొగ్గు గనులను అప్పగించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను జెన్కో పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి వేలకోట్లు రూపాయలు ఆర్ధిక నష్టం వాటిల్లిన విషయం
కార్మికులకు తెలిసిందేనని గుర్తు చేశారు.
వేలంలో పాల్గొనకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం..
ఇప్పుడు మణుగూరులో పీకే ఓసి-2, డిప్ సైడ్ ఎక్స్ టెన్షన్ కోల్ బ్లాక్ పై కూడా అమలు చేయాలనే ప్రయత్నించడం ద్వారా కార్మికుల ఉపాధిని కార్మికుల సంస్థ భవిష్యత్తును రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టడమేనని స్పష్టం చేశారు. గత 3నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కావాలని సింగరేణిని వేలం పాటల నుంచి దూరం పెట్టిందని విమర్శిస్తూ, సింగరేణికి వేలం పాటలలో పాల్గొనే అనుమతి ఇస్తామని స్పష్టంగా ప్రకటించారని తెలిపారు.
ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘం, సీఎంఓఏఏ అధికారుల సంఘం, సింగరేణి యాజమాన్యం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా వేలం పాట ద్వారానే బొగ్గు గనులు సాధిస్తే సింగరేణి సంస్థ మనుగడ, ప్రగతి కొనసాగుతుందని తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేసినారు. స్పష్టమైన ప్రకటనలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సింగరేణిని పక్కన పెట్టి జెన్కో ద్వారా ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్ అప్పగించాలనే కుట్రపూరిత నిర్ణయాన్ని ద్వంద్వ వైఖరిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినారు.
అనంతరం పలువురు కార్మికులు బి ఎం ఎస్ లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. యాదగిరి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వడ్డేపల్లి కుమారస్వామి , గట్టు శ్రీనివాస్, అబ్బోజ్ శివాజీ, కొమ్మ శ్రీనివాస్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన