పెద్దపల్లి, ఆగస్టు1: ఉపాధ్యాయులు ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకొని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్‌లో కనీసం 20 నిమిషాలు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో మెరుగైన విద్య అమలుపై శుక్రవారం రామగుండం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలో కనీస విద్యా ప్రమాణాలు పెంపొందించటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
విద్యాప్రమాణాలు పెంచేందుకు ఏఐ టూల్స్వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో 30 శాతం విద్యార్థులు చురుగ్గా ఉంటారని, ఉపాధ్యాయులు శ్రద్ధ పెడితే మరో 40 శాతం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎస్ విధానం వల్ల ఉపాధ్యాయుల చాలా వరకు పని భారం తగ్గుతుందని, పాఠశాల సంబంధించి సంపూర్ణ వివరాలు యూఐడీసీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో డీ మాధవి, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.