మహబూబ్నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెరువులో పడి చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తీసుకెళ్తే మార్చురీలో కుక్కలు పీక్కుతిన్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నా చనిపోయినప్పుడు మనిషి అంత్యక్రియలు ఎంతో గౌరవంగా జరుపుకొంటాం.. కానీ కళ్లముందే ప్రభుత్వ దవాఖానలో ఉంచిన మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండడం చూసిన కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంతా కాదు.
మార్చురీలో కనీసం మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఫ్రీజర్లు ఏర్పాటు చేయకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. మరోవైపు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో దవాఖాన నిర్వహణ గాలికి వదిలేశారని అర్థమవుతున్నది. చనిపోయింది దళిత యువకుడు కాబట్టి పోలీసులు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి.
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆధునాతన దవాఖానను బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించి మార్చురీలో సకల సౌకర్యాలు కల్పించినా పాత దవాఖానలో పోస్టుమార్టం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో అత్యంత దారుణమైన ఘటన సోమవారం వెలుగు చూసింది. జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమేశ్(32) ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందారు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. ప్రభుత్వ దవాఖానలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది.
కానీ జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరచాల్సిన మృతదేహాలకు దిక్కు లేకుండా పోయిందనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మృతదేహాన్ని భద్రపరచాల్సిన సిబ్బంది కనీసం స్ట్రెచర్ మీద కూడా పెట్టకుండా మార్చురీలో కింద పడేయడంతో వెనుక వైపు నుంచి వచ్చిన కుక్కలు శవాన్ని పీక్కుతిన్నాయి. ఈ దారుణ ఉదంతం ప్రభుత్వ దవాఖానలో దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నది. మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు కూడా లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తున్నది. ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంపై మృతుడి బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఇదిలా ఉండక ఈ ఘటనపై వైద్యశాఖ అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కుక్కలకు ఆహారంగా మారిన మృతదేహం..
మార్చురీలో చనిపోయిన భీమేశ్ శవాన్ని పోస్టుమార్టానికి తరలించగా కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కూడా ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నారు. పోస్టుమార్టం ఆలస్యం కావడంతో అక్కడే వేచి ఉన్నారు. అయితే మార్చురీలో మృతదేహాన్ని కింద పెట్టి బయట నుంచి ఇనుప జాలికి తాళం వేశారు. అయితే మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూసిన బంధువులకు ఓ కుక్క చేతిని, వేళ్లను నోట్లో కరిచి పిక్క తినడం కనిపించింది. దీంతో హతాశయులైన కుటుంబీకులు ఈ ఘటనలు వీడియో తీశారు. సంబంధిత సిబ్బందికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో హడావుడిగా పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. జడ్చర్ల లాంటి పెద్ద పట్టణాల్లో కూడా ప్రభుత్వ దవాఖానలో మృతదేహాన్ని భద్రపరచలేని దుస్థితి ఉందా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగినా కనీసం వైద్యశాఖ అధికారులు విచారణ చేయకపోవడం గమనార్హం. కాగా తన భర్త మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న పట్టించుకోని సర్కారు నిర్లక్ష్యంపై భార్య పద్మ కన్నీరు మున్నీరవుతుంది. అయ్యో ఇలా జరిగిందేంటీ? నా భర్త ఏం పాపం చేశాడని ప్రశ్నిస్తూ భారమైన హృదయాలతో బంధువులు అంత్యక్రియలకు తీసుకువెళ్లారు.
సీఎం జిల్లాలో ఇంత దారుణమా?
జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ప్రభుత్వ దవాఖానలో మృతదేహన్ని భద్రత పరచలేని దుస్థితి నెలకొంది. ఈ ఘటన ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం.మృతదేహాలను గౌరవప్రదంగా బంధువులకు అప్పగించడం ప్రభుత్వ దవాఖాన సిబ్బంది బాధ్యతగా తీసుకోవాలి. ఈ ప్రభుత్వం దవాఖానల నిర్వహణను గాలికి వదిలేసింది. సీఎం సొంత జిల్లా కావడమే కాదు.. వైద్యశాఖ మంత్రి జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం.
– డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి
కొత్త దవాఖానకు తరలిస్తాం..
జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో జరిగిన ఘటనపై జడ్చర్ల సీఐ కమలాకర్ను ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ వివరణ కోరగా ఈ ఘటన జరిగిందని తెలిసిందని.. ఇప్పటినుంచి కొత్త దవాఖానలోని మార్చురీకి మృతదేహాలను తరలిస్తామని వెల్లడించారు.
– కమలాకర్, సీఐ జడ్చర్ల