పెద్దపల్లి, ఫిబ్రవరి4 : భూ కొలతల రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా భూ సర్వే పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లైసెన్స్ సర్వేయర్లకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది సర్వేయర్లకు ధ్రువీకరణ లైసెన్స్పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లైసెన్స్సర్వేయర్లను మండలాల వారీగా అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా అలాట్మెంట్ చేస్తామని తెలిపారు.
భూములున్న రైతులకు భరోసా కల్పించే భూ భారతి చట్టం అమలు కోసం సర్వేయర్లకు ఆధునిక సాంకేతిక వినియోగించేందుకు రోవర్స్ సామగ్రి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ఏడీ సోమేశ్వర్, ఆర్డీవో గంగయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.