పెద్దపల్లి, అక్టోబర్7: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణకు మండల కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అవసరమైన మేర కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండేలా శిక్షణ అందించాలన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై పూర్తి శిక్షణ అందించాలన్నారు. సర్వీస్ ఓటర్లకు, పీడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన వారికి, ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తామన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల మేర ఎటువంటి ర్యాలీ, ప్రచారాలు అనుమతి లేవని, అభ్యర్థితో పాటు 3 మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల నిర్వహణకు ముందస్తూ అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి మంజూరు చేయాలని, సౌండ్ సెట్ వామనానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలన్నారు. ఓట్ల కోసం కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.