పెద్దపల్లి, ఆగస్టు6 : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు.
1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పని చేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగాజయశంకర్ నిలిచారని పేర్కొన్నారు. జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి మంచి ప్రణాళికలు రూపొందించారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.