సుల్తానాబాద్ ఏప్రిల్ 16 : ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కోయశ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ఆరా తీశారు. సెంటర్ ప్రారంభానికి ముందే తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని విషయం తెలిసింది.
ఈ విషయంపై కలెక్టర్ అధికారులకు తగిన సూచనలు చేస్తూ సత్వరమే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించడంతో బుధవారం కొనుగోళ్లను ప్రారంభించారు. దాన్యం తరలింపు సమయంలో కేంద్రాల వద్ద హామాలీ, వాహనాల సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పిఎసిఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డిప్యూటీ తహసిల్దార్ మహేష్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.