పెద్దపల్లి, నవంబర్4 : పెద్దపల్లి జిల్లాలో రాబోవు మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు బంద్ చేసున్నామని, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిన్నింగ్ మిల్లులు, సీసీఐ, ప్రైవేటు కొనుగోలు నిలిపి వేస్తున్నామని అసోసియేషన్ వారు తెలిపినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, కాటన్ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ఓనర్లు పాల్గొన్నారు.