Manipur violence : ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని, లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇండ్లను తగలబెట్టారు. స్థానికంగా ఉన్న సరీఖాంగ్ గ్రామంలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ హింసాత్మక ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు 24 గంటలపాటు మణిపూర్లో ప్రశాంత వాతావరణమే కొనసాగింది.
కానీ, గురువారం తిరిగి హింస చెలరేగింది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు ఉదయం ఎనిమిది గంటల సమయంలో తుపాకీ కాల్పుల మోతలు కూడా వినిపించాయని పోలీసులు తెలిపారు. అయితే, ఎవరూ గాయపడటం లేదా మరణించడం వంటివి తమ దృష్టికి రాలేదన్నారు. తాజా హింసకు ఈ ప్రాంతంలోని రెండు వర్గాలకు చెందిన వారు మద్యం సేవించడమే కారణం. ఆదివారం రాత్రి తంకుల్ నాగా, కుకీ తెగలకు చెందిన వారు మద్యం మత్తులో గొడవపడ్డారు. సమీప గ్రామాలకు చెందిన ఈ రెండు వర్గాల వారి మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఈ హింసలో ఇరు వర్గాలకు చెందిన 40 ఇండ్లను ఆందోళనకారులు దహనం చేశారు.
వెంటనే స్పందించిన పోలీసులు ఈ ప్రాంతంలో ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కర్ఫ్యూ విధించారు. లిటన్ ఏరియాతోపాటు జిల్లా మొత్తం ఇంటర్నెట్ తొలగించారు. అయినప్పటికీ కుకీ తెగకు చెందిన మహిళలు చురాచంద్పూర్ జిల్లాలో భారీ నిరసనలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎల్ఎం ఖవుతే ప్రభుత్వంలో చేరడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి.