రుద్రంపూర్, ఫిబ్రవరి 13 : గతంలో సింగరేణి సంస్థలో ఏదైనా ప్రమాదం జరిగితే దానిపై లోతైన విచారణ జరిపి, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ మారింది. అధికారుల తీరు కూడా అంతకు మించి మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో ఇటీవల ఓబీ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు చెందిన వాహనాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, ఘటనల ఫొటోలు మీడియాకు వెళుతున్నాయనే అనుమానంతో డ్రైవర్ల సెల్ఫోన్లపై అధికారులు ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇకపై క్వారీలోకి ఎవరూ సెల్ఫోన్ తీసుకురావద్దని, మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లే ముందు ఫోన్లను మ్యాన్వే వద్ద జమ చేయాలని అధికారుల నుండి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
“భర్త కొడితే బాధ లేదు కానీ.. తోటి కోడలు నవ్వితే కోపం వచ్చినట్లుంది ప్రస్తుత పరిస్థితి” అంటూ కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రమాదాలు చిన్నవిగా ఉండటం వల్ల ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా, నిర్లక్ష్యంతో పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ల సెల్ఫోన్లపై ఆంక్షలు విధించడం కంటే భద్రతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, మీడియా వార్తలపై కాకుండా భద్రతపై దృష్టి సారించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.