కమాన్ పూర్, మార్చి 11: ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కమాన్ పూర్ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇసుక లారీలతో రహదారులు రక్తసిక్తంగా మారుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుక రావాణాను అరికాడుతామని నాడు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎందుకు నియంత్రించ లేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించారు.
మంథని నియోజకవర్గంలో ఇసుక రీచ్ ల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి నిత్యం వేలాది ఇసుక లారీలు నడుస్తున్నాయన్నారు. ఈ ఇసుక లారీల వల్ల రహదారి పై ప్రయాణం ప్రమాదకరంగా మారిందన్నారు. నీటితో నిండు కుండల కళకళలాడే గోదావరి నదిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎడారిగా మార్చిందని మండిపడ్డారు. ఎడారిగా మారిన గోదావరి నుండి 24 గంటలు ఇసుకను తోడేస్తూ.. ఇసుక బకాసూరులకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తుందని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో ఇసుక రీచ్ లను రద్దు చేసి స్థానిక నియోజకవర్గం ప్రజల అవసరాలకు మాత్రమే ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు చోరువ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, యూత్ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, పెంచికల్ పేట్ మాజీ సర్పంచ్ కొండ వెంకటేష్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, జూలపల్లి, సిద్దిపల్లె మాజీ ఉప సర్పంచులు పోలుదాసరి సాయి కుమార్, జాబు సతీష్, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు కొయ్యడ కుమార్ యాదవ్, నాయకులు నీలం శ్రీనివాస్, సుధాకర్, తోట రాజ్ కుమార్, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.