KTR | మంథని, జనవరి 31: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేశామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ల సన్మాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ, మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్‌లు కేటీఆర్‌ను ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ర్టంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలుగా ఉండేవని అన్నారు. బల్దియాలు అంటే ఖాయా పీయా చల్దియా అనే సామెతగా ఉండేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్‌తో పని చేయాలని దిశానిర్దేశం చేసి పదేళ్ల కాలంలో పట్టణాలను ఎవరు ఊహించనంతా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంథని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పుట్ట శైలజ మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నారని కొనియాడారు.