భూత్పూర్(మూసాపేట), మార్చి 13 : ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది రైతులతో నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రంలో రైతులు రోడ్లమీదికు వచ్చే పరిస్థితి వస్తదని ఎవరూ ఊహించలేదని చెప్పారు. రైతుబంధు ఇవ్వడంలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధును విడుదల చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసి, 90శాతం పనులను పూర్తిచేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను ఉద్దేశ పూర్వకంగానే ఆపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ నిజంగానే పాలమూరు బిడ్డ అయితే వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఎదిరె వెంకటమ్మ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వృద్ధులకు 4వేల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేసింది. మళ్లీ కాంగ్రెస్‌కు ఎవరూ ఓటు వేయరని స్పష్టంచేశారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డికి బీఆర్ఎస్ విజ్ఞప్తిచేసింది. శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం బీఆర్కే భవన్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలోని బృందం సీఈవోను కలిసింది. రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవల్ అధికారులు, ఏజెంట్లను నియమించాలని విన్నవించారు. బీఎల్వోలను నియమించకుంటే ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ విషయంపై సీఈవో సానుకూలంగా స్పందించారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ లీగల్‌సెల్ బాధ్యులు సోమా భరత్‌కుమార్, లలితారెడ్డి తదితరులు ఉన్నారు.