Baldia | కోల్ సిటీ, నవంబర్ 4 : రామగుండం నగర పాలక సంస్థ ‘ఆధార్’ ఆపరేషన్ పేరుతో కార్మికులను ఇంటికి పంపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో మూలంగా ఈ కార్పొరేషన్లో సుమారు 35 మంది కార్మికుల భవిష్యత్ ఇరకాటంలో పడింది.సోమవారం నాడు పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న 15 మంది కార్మికుల విధులను నిలిపివేశారు.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులను, సిబ్బంది వివరాలను సేకరించి ఆన్లైన్ ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్ పోర్టల్లో ఆధార్, ఇతర వివరాలను నవీకరించాలని ఆర్థిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25వ తేదీ వరకు చివరి గడువు విధించింది. ఆ పోర్టల్లో ఆధార్ వివరాలు సమర్పించని ఉద్యోగుల వేతనాలను నవంబర్ నెల నుంచి నిలిపివేయాలని ఆదేశించింది.
కార్మికులను తొలగించేందుకు చర్యలు..
గత నెల 25న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘అయోమయంలో ఔట్ సోర్సింగ్’ శీర్షికన ముందే ప్రత్యేక కథనం ప్రచురించింది. కాగా రామగుండం కార్పొరేషన్లో 448 మంది కార్మికులు ఔట్ సోర్సింగ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 121 మంది, కార్యాలయంలో మరో నలుగురు ఉద్యోగులతోపాటు ఒక కాంట్రాక్ట్ ఏఈ విధుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే నెల తరువాత వివిధ పద్ధతుల్లో విధుల్లో చేరిన కార్మికులను తొలగించేందుకు చర్యలు చేపడుతోంది.
శానిటేషన్ విభాగంలో మే నెల తర్వాత ఉద్యోగాల్లో చేరిన 15 మంది కార్మికులను పోర్టల్లో ఆధార్ వివరాలు నవీకరించని కారణంతో సోమవారం నుంచి నిలిపివేశారు. అంతకుముందు డెయిలీ వైజ్ కింద ఆగ్రోస్ ద్వారా కొంతమంది కార్మికులను పనుల్లోకి తీసుకున్నారు. వారిలో మరో 20 మంది కార్మికులను సైతం తొలగించేందుకు సిద్ధమవుతోంది.
ఐతే రామగుండం కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతభత్యాల చెల్లింపులు కార్పొరేషనే భరిస్తుంది. వీరి విషయంలో ప్రభుత్వంపై అంతగా భారం ఉండదు. కానీ మే నెలకు ముందు సైతం గత పాలక వర్గంలోని కార్పొరేటర్లు, రాజకీయ నాయకుల పైరవీలతో కార్పొరేషన్లోని వివిధ విభాగాల్లో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు కల్పించారు. వారి భవితవ్యం కూడా ఆగమ్యగోచరంగా ఉంది. ఈ పరిణామాలపై మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు ప్రేక్షక పాత్ర వహించడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీని వివరణ అడగగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోర్టల్లో ఆధార్, ఇతర వివరాలు నమోదు చేయని కార్మికుల వేతనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో