Fake calls | కోల్ సిటీ, ఏప్రిల్ 26 : ‘హలో.. మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ షాపుకు సంబంధించిన డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు చెల్లించాలి.. లేదంటే చట్ట ప్రకారం మీ దుకాణం సీజ్ చేయాల్సి ఉంటుంది.. ఈ నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా చెల్లిస్తే.. మా సిబ్బంది షాపు వద్దకు వచ్చి రసీదు ఇస్తారు..’ అంటూ మరోసారి ఆపరచితుడు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలువురు వ్యాపారులకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో సైతం ఇదే అపరిచితుడు తాను మున్సిపల్ కమిషనర్ అంటూ గోదావరిఖనిలోని పలువురు వ్యాపారులకు ఫోన్ కాల్స్ చేసి హుందాగా మాట్లాడిన సంఘటన విధితమే. పలువురికి అనుమానం వచ్చి ట్రూ కాలర్ లో చూస్తే మున్సిపల్ కమిషనర్ అని రావడంతో కొంతమంది వ్యాపారులు అపరిచితుడి వలలో పడ్డారు. ఆ నంబర్ కు లైసెన్సు ఫీజు చెల్లించారు. తర్వాత అపరిచితుడి బండారం బయటపడటంతో అంతా అప్రమత్తమయ్యారు. కొంత కాలం తర్వాత మళ్లీ అపరిచిత వ్యక్తి ఇదే పద్ధతిలో వ్యాపారులకు ఫోన్ కాల్స్ చేయడం లైసెన్సు ఫీజు చెల్లించాలంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు దుకాణాల యజమానులకు మళ్లీ అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈసారి ఫీజు చెల్లించకపోతే షాపును సీజ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
దీంతో వ్యాపారులు అయోమయంకు గురవుతున్నారు. కొంతమంది ఆఫీస్ కు చేరుకొని ఆరా తీయగా, అదంతా ఫేక్స్ కాల్స్ అని తెలుసుకొని అపరిచిత వ్యక్తుల వలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈవిషయమై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ (ఎఫ్ఎసీ) కమిషనర్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు పేరిట గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ అధికారుల పేరుతో వ్యాపారులకు ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్లో డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు పొందే సౌలభ్యంను ఉపయోగించుకోవాలని కోరారు. వివరాలకు నగర పాలక కార్యాలయంలోని సంబంధిత విభాగంలో స్వయంగా లేదా 9966626680 ఫోన్ నంబర్ నందు సంప్రదించాలని సూచించారు.