న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండటంతో బ్లాక్‌మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్ల ముందు పెద్దయెత్తున వినియోగదారులు బారులు తీరి ఉంటున్నారు. గ్యాస్ కొరతను ఆసరాగా తీసుకుని బ్లాక్‌మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. రూ. 950 గృహ వినియోగ సిలిండర్‌ను రూ.3,500కు, రూ.2,000 వాణిజ్య సిలిండర్‌ను రూ.5,000కు బ్లాక్‌లో అమ్ముతున్నారు.
పంజాబ్‌లోని చండీగఢ్‌లో వినియోగదారులు ఉదయం 4.30 గంటలకే గ్యాస్ ఏజెన్సీ ముందు లైన్లో నిలుచుంటున్నారు. జలంధర్, అమృత్‌సర్‌లో గ్యాస్ ఏజెన్సీల వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడగా, చండీగఢ్‌లో పోలీసుల పర్యవేక్షణలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా గ్యాస్ కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక పక్క ఎండ నెత్తిని మాడ్చేస్తుండగా, 8 గంటల పాటు క్యూలోనే పడిగాపులు కాసినా సిలిండర్ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పక్క వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడగా హర్యానాలో హఠాత్తుగా డీజిల్ సంక్షోభం ఏర్పడింది. చాలామంది తమ అవసరాలకు మించి డీజిల్‌ను కొని నిల్వ చేస్తుండటంతో క్రమంగా కొరత ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారుల అవసరానికి మించి డీజిల్, సీఎన్జీ అమ్మవద్దంటూ పెట్రోల్ పంపు ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఆగ్రాలోని స్వీట్ పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇక్కడ బూడిద గుమ్మడితో తయారు చేసే ప్రసిద్ధ పేఠా స్వీట్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు తయారీ యూనిట్లను మూసివేశారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిశ్రమను మూసేయాల్సి ఉంటుందని అంటున్నారు.
పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారికి ఎల్పీజీ కొత్త కనెక్షన్ ఇవ్వడం కానీ, వారి పాత సిలిండర్‌లోకి గ్యాస్ నింపడం కానీ చేయరు. అంతేకాక, వారి ఎల్పీజీ సిలిండర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకే ఇంటిలో పీఎన్జీ, ఎల్పీజీ కనెక్షన్ ఉండటం చట్టవిరుద్ధంగా భావిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గ్యాస్ బుక్ చేయాలంటే తమ పాత గ్యాస్ సిలిండర్ సరఫరా తేదీకి, ప్రస్తుతం బుక్ చేస్తున్న తేదీకి పట్టణంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి ఉండాలి.