Nandi Medaram | ధర్మారం, అక్టోబర్ 29 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ( సింగిల్ విండో) మాజీ చైర్మన్ పీర్ మహమ్మద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పీర్ మహ్మద్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అతనిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించి పరీక్షలు చేయించగా అతనికి కిడ్నీ ఫెయిల్యూర్ అని నిర్ధారణ అయింది. దీంతో అతనికి చికిత్స చేస్తున్న క్రమంలోనే మంగళవారం రాత్రి గుండెపోటుతో అక్కడి దవాఖానాలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మండలంలో పీర్ మహమ్మద్ రాజకీయ కురువృద్ధుడు. 1981లో పాత తాలూకా సుల్తానాబాద్‌లో బ్లాక్ సమితి కోఆప్షన్ సభ్యుడిగా ఆయన పదవిని నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అనంతరం ఎన్టీఆర్ 1983లో టీడీపీ స్థాపించడంతో పీర్ మహమ్మద్ ఆ పార్టీలో చేరి క్రియాశీలకంగా కొనసాగారు. టీడీపీ పాలనలో 1987లో మండల ప్రజా పరిషత్ వ్యవస్థ ఏర్పాటైంది.
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి..
అదే సంవత్సరం తొలిసారిగా ప్రత్యక్షంగా ధర్మారం మండల ప్రజా పరిషత్ ( ఎంపీపీ) ప్రెసిడెంట్ కోసం ఎన్నిక జరగగా.. తెలుగుదేశం పార్టీ నుంచి పీర్ మహమ్మద్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం నంది మేడారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 1995లో ఎన్నికలు నిర్వహించగా పీర్ మహమ్మద్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో 2000 వరకు కొనసాగారు. ఆ తర్వాత సింగిల్ విండో చైర్మన్ల పదవి కాలం పొడిగించడంతో 2004 వరకు విండో చైర్ పర్సన్‌గా కొనసాగారు.
కాగా మైనారిటీ వర్గం నుంచి వచ్చిన పీర్ మహమ్మద్‌కు మండలంలో సౌమ్యుడని, రాజకీయ కురువృద్ధుడని మంచి పేరు ఉంది. పీర్ మహమ్మద్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉంది. ఆయన పార్థీవ దేహాన్ని స్వగ్రామం నంది మేడారం తీసుకువచ్చారు. పీర్ మహమ్మద్ మరణం పట్ల వివిధ పార్టీల రాజకీయ నాయకులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు. బుధవారం పలువురు రాజకీయ పార్టీ నాయకులు పీర్ మహమ్మద్ పార్థీవదేహానికి నివాళులర్పించారు.
పీర్ మహమ్మద్ మరణంతో నంది మేడారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పీర్ మహమ్మద్ ఎందరికో రాజకీయ గురువు అని, నంది మేడారం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని మంచి పేరు ఉంది.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల