జగిత్యాల, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : అందె సత్య కిశోర్‌ది కోరుట్ల. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పావని. అక్కనిత్య. తండ్రి చిన్న ప్రైవేట్ ఉద్యోగి. దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు. డిగ్రీ పూర్తి చేసిన తండ్రి వెంకటేశ్వర్లు, మొదట్లో సీడ్ కంపెనీలో చిన్న సేల్స్‌మెన్‌గా చేరాడు. జగిత్యాల, మెట్పల్లి, నిజామాబాద్ డివిజన్లలో మార్కెటింగ్ చేశాడు. 2012 వరకు అదే పనిలో ఉన్నాడు. వచ్చే జీతం కుటుంబ అవసరాలకూ సరిపోకపోయేది. కూతురు నిత్య, కొడుకు సత్య కిశోర్‌ను చదివించేందుకు ఇబ్బందులు ఎదురైనా ఏలోటు రాకుండా చూసుకున్నాడు. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చదివించాడు. పిల్లలు కూడా చదువులో చురుగ్గా ఉండడంతో ఎలాగైనా ఇద్దరినీ డాక్టర్లుగా చేయాలని ఆశపడ్డాడు.
అందుకోసం ఎక్కువగానే శ్రమించాడు. అయితే పెరిగే నిత్యావసరాల ధరలు, కుటుంబ బాధ్యతలు, ఇంటి కిరాయి, ఇతర అవసరాలు.. ఇలా అన్ని చెల్లించే వరకు జీతం మిగలకపోయేది. అయినా పిల్లలను డాక్టర్లను చేయాలన్న సంకల్పాన్ని వదలలేదు. 2012లో సీడ్ కంపెనీలో ఉద్యోగం మానేసి ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. అందులోనూ పెద్దగా వేతనం రాలేదు. కానీ, తిరుగుడు తప్పడంతో సంతోషపడ్డాడు. అయితే, ఐదారేండ్ల తర్వాత అక్కడ కూడా పని మానేసి, జగిత్యాలలోని లడ్డూఖాజా హోటల్ సమీపంలో సత్య మీ సేవా సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మొదట కూతురు మంచి మార్కులతో పదో తరగతి పూర్తి చేయగా, కూతురిని ఇంటర్ కోసం హైదరాబాద్‌కు పంపించాడు. కరోనా కారణంగా విధిలేని పరిస్థితుల్లో బిడ్డను బీఎస్సీ బయోటెక్నాలజీలో చేర్పించాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఫైనలియర్ చదువుతున్నది. బిడ్డను డాక్టర్ చేయలేకపోయామన్న బాధ వెంటాడినా.. టెన్త్‌లో 10 జీపీఏ సాధించిన కొడుకునైనా డాక్టర్ చేయాలని అనుకున్నాడు. హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీలో చేర్పించి, ఇంటర్ చదివించాడు.
డాక్టర్ కోర్సు చేయాలంటే ధనవంతులకే సాధ్యం. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు అందని ద్రాక్షే. మొన్నటి దాకా ఇదే నిజం. కానీ, స్వరాష్ట్రంలో మార్పు మొదలైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్య విద్య చేరువైంది. లక్షల రూపాయలు అవసరం లేకుండా.. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశం ఏర్పడింది. అందుకు ఉదాహరణే జగిత్యాలకు చెందిన అందె సత్యకిశోర్. దిగువ మధ్యతరగతి నుంచి ఆ విద్యార్థి, మొదటి ప్రయత్నంలో ప్రైవేట్‌లో సీటు సంపాదించినా.. సంవత్సరానికి 20లక్షల రూపాయలు కట్టలేక వదిలేసుకున్నాడు. కానీ, రెండోసారి ప్రయత్నించి ఉన్న ఊరిలోనే ఫ్రీసీటు సంపాదించాడు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్లే సాధ్యమైందని, ఇదంతా కేసీఆర్ కృషేనని సత్యకిశోర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కొడుకును మెడిసిన్ చేయించేందుకు తాము పడిన కష్టాలను వివరించారు.
సత్యకిశోర్ 2022లో ఐపీఈ రాసి 971 మార్కులు పొందాడు. నీట్ పరీక్షకు హాజరయ్యాడు. తొలి ప్రయత్నంలో 401 మార్కులు సాధించాడు. ప్రైవేట్ కాలేజీలో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఆ సీటుకు 11 లక్షలు ఫీజు కట్టాలని, అవి కాకుండా ఏడాదికి మరో 10 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో నిరాశ చెందాడు. ఇదంతా గమనించిన కిశోర్ ‘నాన్న నేను ఎంబీబీఎస్ ఫ్రీ సీటు సాధిస్తా. ఒక్కసారి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లి ప్రయత్నిస్తా’ అని చెప్పాడు. అప్పటికే అప్పుల భారం ఎక్కువ కావడంతో తండ్రి ఆలోచనలో పడ్డాడు. తర్వాత ఏదైతే అదవుతుందని, మరి కొంత అప్పు తెచ్చి కిశోర్‌ను లాంగ్ టర్మ్ పంపించాడు. కిశోర్ ఈ యేడాది జూన్‌లో జరిగిన నీట్ పరీక్షకు హాజరై 487 మార్కులు తెచ్చుకున్నాడు. జగిత్యాల మెడికల్ కాలేజీలో జనరల్ కేటగిరీలో ఫ్రీ సీటు సంపాదించాడు. మొన్ననే కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఉన్న ఊరిలోనే సీటు రావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
డాక్టర్ కావాలనేది నా జీవిత ఆశయం. మా అక్క అంటే మా పెద్దనాన్న కూతురు ఇంటర్ బైపీసీలో చేరింది. ఆ కోర్సు ఎందుకే అంటే ‘డాక్టర్ అవుతానురా’ అంది. ఇప్పుడు ఫైనలియర్ చదువుతున్నది. అక్క కంటే ముందే బాబాయి మిథున్ (మా చిన్నతాత కొడుకు) డాక్టర్ అయ్యారు. ఎండీ జనరల్ మెడిసిన్ చేసి, న్యూరోఫిజిషియన్ స్పెషలైజేషన్ చదువుతున్నారు. వాళ్లిద్దరినీ స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. నేను మొదట నీట్ రాసినప్పుడు 401 మార్కులు వచ్చాయి. జాతీయస్థాయిలో 1.90 లక్షల ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో బీ కేటగిరీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే, సంవత్సరానికి 20 లక్షలు వెచ్చించే స్థోమత లేక సీటు వదిలిపెట్టా. అమ్మానాన్నలను ఒప్పించి, లాంగ్ టర్మ్‌కు వెళ్లా. కష్టపడి చదివా.
కచ్చితంగా సీటు సంపాదిస్తానన్న నమ్మకం కలిగింది. అయితే, నీట్ పరీక్ష నాలుగు నెలలు ఉండగా జ్వరం వచ్చింది. పచ్చకామెర్లు సోకాయి. చదువుపై దృష్టిపెట్టలేని పరిస్థితి. బయటపడటానికి దాదాపు రెండు నెలలు పట్టింది. కోలుకున్న తర్వాత మళ్లీ చదవడం మొదలు పెట్టా. రెండు నెలల్లోనే సిలబస్‌ను కవర్ చేయాల్సి వచ్చింది. నీట్ రాశా. ఈసారి 487 మార్కులు వచ్చాయి. జాతీయ స్థాయిలో 1.20 లక్షలు, రాష్ట్రస్థాయిలో 5,200 ర్యాంకు వచ్చింది. మొదటి కౌన్సెలింగ్‌లోనే జనరల్ కేటగిరీలో నాకు జగిత్యాల మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చింది. నా ఆశయాన్ని సాధించిన సమయంలో కలిగిన అనుభూతి చెప్పలేనిది.
అయితే, ఈ సీటు రావడానికి కారణం మాత్రం సీఎం కేసీఆరే. 30 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి 6వేల సీట్లు అందుబాటులోకి తేవడం వల్లే డాక్టర్ సీటు సాధ్యమైంది. నాకే కాదు, నాలాంటి వందలాది మంది విద్యార్థులకు సీఎం కేసీఆర్ జీవితాన్ని ప్రసాదించాడు. దాదాపు ఐదువేల మంది డాక్టర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. ఇప్పుడు నేను డే స్కాలర్‌గా ఉండే కాలేజీకి వెళ్తా. హాస్టల్ ఫీజు సైతం కట్టాల్సిన పనిలేదు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి. అది కూడా రీయింబర్స్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా డాక్టర్ అవుతున్నా. ఒకప్పుడు సంపన్నులకే డాక్టర్ విద్య అనుకనే స్థితి నుంచి నేడు ఎవరైనా డాక్టర్ కావచ్చన్న ధీమా వచ్చింది. హ్యాట్సాఫ్ టూ సీఎం కేసీఆర్ సార్.
అప్పులు చేసి, అష్టకష్టాలు పడి సత్యకిశోర్ను చదివించా. మా కొడుకు డాక్టర్ కోర్సులో చేరినప్పుడు కలిగిన సంతోషం జీవితంలో మరెప్పుడూ కలుగలేదు. దీనికి కారణం సీఎం కేసీఆరే. ఎందుకంటే.. నేను ఇంటర్ చదివినప్పటి నుంచి మొన్నటి వరకు డాక్టర్ కోర్సు చదవడం అంటే కేవలం ధనవంతులకే సాధ్యమయ్యేది. ఇంతకుముందు రాష్ట్రంలో రెండు, మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఎంసెట్‌లో 500 ర్యాంకు వచ్చినా సీటు రాకపోయేది. ఇప్పుడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పుణ్యాన ఇన్ని సర్కార్ మెడికల్ కాలేజీలు వచ్చినయ్. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు డాక్టర్లు అయ్యే అవకాశం ఏర్పడింది. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
కిశ్‌ర్ కష్టపడి చదివే విద్యార్థి. అతడి పట్టుదలను చూసి డాక్టర్ అవుతాడని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కిశోర్, అతని సోదరి నిత్య ఇద్దరు మా స్కూల్లోనే పదో తరగతి వరకు చదివారు. ఇద్దరూ చురుకైన స్టూడెంట్సే. తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేయాలని కష్టపడి చదివించారు. వాళ్ల ఆశలను వమ్ము చేయలేదు. కిశోర్‌కు చదువుపై ఉన్న మక్కువను గుర్తించి, అతడిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చాం. టీచర్లు సైతం కిశోర్‌కు సహకరించారు. టీచర్ల, మా నమ్మకాన్ని కిశోర్ ఎంబీబీఎస్ సీటు సాధించి నిలబెట్టాడు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటాడన్న నమ్మకం ఉన్నది.