అత్యంత ధనిక దేశంలోని అత్యంత ధనిక మెగా సిటీ అయిన న్యూయార్క్ మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీ ఎన్నికవడం అమెరికన్లనే కాదు, ప్రపంచాన్నీ నివ్వెరపరిచింది. భారత సంతతకి చెంది, ఆఫ్రికా, దక్షిణాసియా నేపథ్యం ఉన్న ‘డెమొక్రాటిక్ సోషలిస్ట్’ జోహ్రాన్ మమ్దానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఏకైక అగ్రరాజ్య గమనంలో వస్తున్న మార్పునకు స్పష్టమైన సంకేతం. అమెరికాను శ్వేతజాతీయులకు, సంపన్న కార్పొరేట్ శక్తులకు, సాంప్రదాయ, ఛాందస క్రైస్తవ విశ్వాసులకు అత్యంత అనుకూల దేశంగా మార్చడమేగాక, ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చి అమెరికాలో సంపద సృష్టిస్తున్న విదేశీయులను తరిమివేయాలన్న తిరోగామి శక్తులకు నాయకుడిగా అవతరించాడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి బడా నేత మద్దతున్న తన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోను ఓడించి మమ్దానీ సంచలనం సృష్టించారు.
గడచిన పదేండ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. బిలియనీర్ల సంఖ్య పెరగడంతో పాటు ఆర్థిక అసమానతలూ ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. పూర్వ డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో మొదలైన ద్రవ్యోల్బణం అమెరికాలో దిగువ మధ్య తరగతి, శ్రామికవర్గాల నడ్డివిరిచే స్థాయికి చేరుకున్నది. దీనికి ట్రంప్ విధానాలు తోడై సంపన్న నగరం న్యూయార్క్ సహా అమెరికాలోని అన్ని ప్రాంతాల సామాన్య ప్రజల బతుకును దుర్భరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ సోషలిస్టుగా ముద్రపడిన మమ్దానీ ఇచ్చిన హామీలను ఇండియా సహా అనేక దేశాల రాజకీయ పరిశీలకులు ఎగతాళి చేశారు.
న్యూయర్క్ నగరంలో ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, రిటెయిల్ దుకాణాలను ప్రభుత్వం నడపడం, ఇండ్ల అద్దెలు పెరగకుండా నిలిపివేయడం, ఏడాదికి పది లక్షల డాలర్ల కన్నా ఎక్కువ సంపాదించేవారిపై 2 శాతం పన్ను విధింపు, ఇంకా అవసరమైన వారికి గృహనిర్మాణ పథకాల అమలు వంటి హామీలతో మమ్దానీ ఆ ఎన్నికల్లో న్యూయార్కర్లను ఆకట్టుకున్నారు. ఇండియా వంటి వర్ధమాన దేశాల్లో ఓట్ల వరదను తీసుకొచ్చే ఇలాంటి జనాకర్షక పథకాల హామీలు అమెరికా బడా నగరంలో మమ్దానీకి ఓట్ల వర్షం కురిపిస్తాయా? అని ఎందరో పెదవి విరిచారు. అయితే న్యూయార్క్ నగర ప్రజలు ముఖ్యంగా అల్పాదాయవర్గాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కష్టాలు మమ్దానీ గెలుపునకు మార్గం సుగమం చేశాయి.
మమ్దానీ గెలిస్తే న్యూయార్క్‌కు నిధులు నిలిపివేస్తానన్న అధ్యక్షుడి ఘీంకారాలను జనం ఖాతరు చేయలేదు. ప్రజల తక్షణ కష్టాలు తీర్చడానికి మమ్దానీ విడమర్చి చెబుతున్న సామ్యవాదమే తగిన మందని నమ్మి నగరంలోని 85 లక్షల జనాభాలో 50.4% మందికి పైగా ఆయనకు ఓటేశారు. అమెరికా సర్కారు అనుసరించే కార్పొరేట్ అనుకూల పెట్టుబడిదారీ విధానానికి, ఆశ్రిత పోకడలకు ఏ మాత్రం అనుకూలం కాదని, మారుతున్న కాలంలో మమ్దానీ రూపంలో వీస్తున్న కొత్త గాలులకు తాము అనుకూలమని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిని గెలిపించడం ద్వారా నిరూపించారు.
ప్రచారం సందర్భంగా మమ్దానీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అన్నింటినీ అమలు చేయడం అతని వల్ల కాదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రచారం మొదలైనప్పుడు అవసరమైన ప్రజలకు ఉచితంగా ఇంట్లో వాడే సరుకులు ఇస్తామన్న హామీని మమ్దానీ కొంత సవరించుకుని వాటిని ‘చౌక ధరలకు’ అందేలా చూస్తానని వాగ్దానం చేశారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమేగాక, అధిక ఖర్చుతో కూడుకున్నది. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఎంతవరకు సాధ్యమో కాలమే నిర్ణయిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరే (సింగిల్ పేరెంట్స్) తమ సంతానాన్ని, తమను తాము పోషించుకోవడానికి రెండు ఉద్యోగాలు చేస్తున్న న్యూయార్క్‌లో ఇలాంటి జనం ఎక్కువ. అలాంటి తల్లిదండ్రుల పిల్లల బాగోగులు చూడడానికి ఉచిత సౌకర్యాలు కల్పిస్తానన్న ఈ యువ నేత హామీ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
ట్రంప్ పాలనలో వలస జనంపై ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) సిబ్బంది చేసే దుర్మార్గమైన దాడులను అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మమ్దానీపై పడింది. ఈ విషయంలో పాలక రిపబ్లికన్ పార్టీకి చెందిన మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) శక్తుల దుందుడుకు మాటలను, చేతలను ఈ మహానగరంలో అడ్డుకోవడం కొత్త సోషలిస్ట్’ మేయర్‌కు అంత సులువు కాదు.
న్యూయార్క్ మేయర్ ఎన్నిల్లో ట్రంప్ మద్దతు ఉన్న అభ్యర్ధిని ఓడించి మమ్దానీ విజయం సాధించడాన్ని అమెరికాలో సామ్యవాద జెండా ఎగరడం మొదలైనట్టు’గా కొందరు సంబరపడుతున్నారు. అమెరికా యావత్తూ ఇక వామపక్ష మార్గంలో పయనించబోతోందనడానికి న్యూయార్క్ మేయర్ ఎన్నిక సంకేతమని కూడా వ్యాఖ్యలు, ఆకాంక్షలు వినిపించాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా అమెరికా పశ్చిమాన ఉన్న వాషింగ్టన్ స్టేట్‌లోని అతిపెద్ద నగరం సియాటిల్ (ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం రెడ్మాండ్ ఉన్న ప్రదేశం) నగర కౌన్సిల్ ఎన్నికల్లో సైతం డెమొక్రాటిక్ సోషలిస్టులు చెప్పుకోదగిన ఘన విజయాలు సాధించారు.
ఈ పార్టీకి చెందిన భారత అమెరికన్ మహిళ క్షమా సావంత్ 2014 నుంచి 2024 వరకూ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఎన్నికై నగర ప్రజలకు గొప్ప సేవలందించారు. పుణె నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఈ ఆర్థికవేత్త తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అమెరికాలోని తన నగరంలో సోషలిస్టు సిద్ధాంతాలను, పతాకాన్ని నిలబట్టే కృషిలో సఫలమయ్యారు. మమ్దానీ విజయంతో అమెరికాలో పటిష్ఠంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థలకు బీటలువారే రోజులు ఎంతో దూరంలో లేవని అంచనా వేయడం భ్రమాజనిత లోకానికి బాటలు వేస్తుందని చెప్పాలి.
న్యూయార్క్ నగర మేయర్‌గా గుజరాతీ, పంజాబీ మూలాలున్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ మమ్దానీ ఎన్నికవడం అమెరికాలో, పోనీ న్యూయార్క్ నగరంలో భారతీయులకు, ఇండియాకు ఘన విజయంగా కొందరు అంచనా వేయడం కూడా పూర్తిగా సబబు కాదు. ఇతర దేశాలకు చెందిన ప్రజలతో పోల్చితే రాజకీయాలపై భారత సంతతి జనానికి ఆసక్తి బాగా తక్కువ. తీవ్ర మార్పులకు దారితీసే రాజకీయ సిద్ధాంతాలు, పోకడలు, ఉద్యమాలకు భారత అమెరికన్లు ఆమడ దూరంలో ఉంటారు.
ఇప్పుడిప్పుడే క్షమా సావంత్ వంటి భారతీయ అమెరికన్ మేధావులు, రాజకీయ కార్యకర్తలు రాజకీయాల్లోకి చురుకుగా రావడం మొదలైంది. అయితే, ‘అమెరికా విలువలు, విశ్వాసాల’ను అనసరిస్తూ తీవ్రవాద పోకడలకు దూరంగా ఉండే ‘ఆదర్శ మైనారిటీ వలసవవర్గం’గా వచ్చిన మంచిపేరును కాపాడుకోవాలనే యావ ఎక్కువగా ఉండే భారత సంతతి ఓటర్లు మమ్దానీ గెలుపును పెద్దగా కోరుకోలేదు. మమ్దానీ చెప్పే విషయాలకు తాము సైద్ధాంతికంగా వ్యతిరేకమనే విషయం వారికి తెలుసు. నగరంలోని శ్వేతజాతి, ఇతర వర్గాలు లేదా జాతుల ప్రజల నుంచి ఆయనకు ఎక్కువ మద్దతు లభించిందని వార్తలొస్తున్నాయి. మొత్తం మీద ఆర్థిక, ప్రజా సంక్షేమ అజెండాయే ఆయనను గెలిపించింది.
– నాంచారయ్య మెరుగుమాల