సైదాపూర్, నవంబర్ 6 : రైతన్నకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఓ వైపు సర్కారు ప్రోత్సాహం లేక ఆగమైతుంటే, మరోవైపు ప్రకృతి ప్రకోపానికి కోలుకోలేని నష్టం జరుగుతున్నది. ఇటీవల మొంథా తుపాన్ రైతులను నిండా ముంచగా, సైదాపూర్ మండల రైతులను అయితే కోలుకోకుండా చేసింది. కోతకు వచ్చిన వరిని నీట ముంచి తీవ్ర నష్టం మిగిల్చింది. మండల కేంద్రంలోని వెన్కేపల్లి తుమ్మల చెరువుకు భారీ వరద వచ్చింది. చెరువు నిండి మత్తడి దూకడంతో పాటు కట్టుకాలువ గుండా నీరు ప్రవహించింది. ఆ ప్రవాహదాటికి కట్టుకాలువ రెండు చోట్ల తెగింది. నీరు దిగువకు పోటెత్తడంతో మొదట సైదాపూర్ ఎల్లమ్మగుడి సమీపంలో కొనుగోలు కేంద్రంలోని వడ్లు కొట్టుకుపోయాయి.

అలాగే వెన్కేపల్లి, సైదాపూర్, జాగీర్పల్లి, ఆరెపల్లి, వెన్నంపల్లి, సోమారం, లస్మన్నపల్లి గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయి. సైదాపూర్- రాయికల్, సైదాపూర్- హుజూరాబాద్, సైదాపూర్ – మొలంగూర్ రహదారులు దెబ్బతిన్నాయి. కాగా, కాలువ తెగి వారం గడుస్తున్నా వరద ప్రవాహం తగ్గకపోవడంతో వందలాది ఎకరాల్లో ఇంకా నీరు నిలిచే ఉండగా, కండ్ల ముందే పంటలు దెబ్బతినడం చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. వానలు పడ్డ ప్రతిసారి ఎగువనుంచి వచ్చే వరదకు కట్టుకాలువ తెగడంతో పంట పొలాలు మునిగి నష్టపోతున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కట్టుకాలువను మరమ్మతులు చేయడంతోపాటు తెగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.