రాష్ట్రంలో గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పరస్పరం నెపాలను మోపుకొంటున్నాయి. కులగణన మొదలు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్ ఫర్ జస్టిస్ వరకూ ఇదే వరుస. ఇక్కడే అసలు ప్రశ్న ఎదురవుతున్నది. దేశాన్ని 75 ఏండ్లుగా పాలించింది ఆ రెండు పార్టీలే. మరెందుకు ఇప్పటివరకు వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించలేదు? ఆ ప్రయత్నం చేయలేదు? అందుకు కారణం సుస్పష్టం. బీసీలపై ఈ రెండు పార్టీలదీ కపట ప్రేమనే. ఓటు బ్యాంకు రాజకీయమే. ఇప్పుడూ పరస్పరం పోటీ పడుతున్నదీ అందుకోసమే తప్ప మరేమీ లేదు.
పాలనా విధానాల పరంగా.. వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకే విధానం. పేరుకే వేర్వేరు పార్టీలు కానీ పాలనా రీతులు, ఆచరించే మూల ప్రమాణాలు ఒక్కటే. ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వంచించడంలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే. ఒకే కుటిల నీతి. రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునే ఎత్తులే తప్ప బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అప్పగించే యోచనే వీటికి లేదనేది స్పష్టం. ఈ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడల్లో పావులుగా మిగులుతున్నది, దశాబ్దాలుగా దగా పడుతున్నది ఓబీసీలే. జాతీయ పార్టీల ఆ విధానాల ఫలితంగా ఓబీసీ వర్గాలు ప్రాంతీయ పార్టీలకు పట్టుకొమ్మలై నిలిచాయి.
ఆ ప్రాంతీయ పార్టీలు సైతం ఓబీసీ వర్గాలకు పెద్దపీట వేశాయి. దేశంలో ఓబీసీ వర్గాలు ఎంతో కొంత రాజకీయ అవకాశాలను పొందాయంటే అది ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే. ఇకనైనా బీసీ సంఘాలు సత్యాన్ని గ్రహించాలి. జాతీయ పార్టీలతో అంటకాగడం మానాలి. బెల్లం మాటలకే జబ్బలు చరచుకోవడం మాని వాస్తవ దృష్టితో ముందుకుసాగాలి. భావితరాలకు వాటిల్లబోయే ప్రమాదాన్ని గుర్తెరగాలి.
అంతఃకలహాలతో చీలిపోక ఏకతాటిపై నిలబడాలి. అంతేకాదు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలి. అవకాశాలను అందివ్వగల, అభ్యున్నతికి బాటలు వేస్తున్న, హక్కుల సాధనకు బీసీలకు బాసటగా నిలుస్తున్న, గొంతు కలుపుతున్న నూతన శక్తులతో ఏకం కావాలె. బీసీ హక్కులకు స్పష్టమైన హామీనిచ్చే ప్రజాస్వామిక, ప్రగతిశీలక పార్టీల వెంట నడవాలి. అది ఓబీసీ వర్గాలకు అత్యవసరం. జాతీయ పార్టీల వంచనను ఢీకొట్టే పాశుపతాస్త్రం. అదే దశాబ్దాల ఆకాంక్షల సాకారానికి అనుసరణీయ మార్గం.
– గవినోళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు