హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యానికి కాంగ్రెస్ సర్కార్ తెరతీసింది. 50% పోస్టులను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (ఎస్సీడీడీ)కు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఈ మేరకు ఎస్సీడీడీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తున్నది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్-1964 కింద తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సొసైటీ ఏర్పాటయ్యింది. కార్పొరేషన్ నిర్వహణకు, సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రత్యేకంగా జీవో-4 ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీచేసింది.
కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీ, జీఎంతోపాటు మొత్తంగా 32 మంది సిబ్బందిని మంజూరుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలకు సైతం ఒక్కో జిల్లాకు ఈడీ , ఈవో, ఏఈవోతోపాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర అన్నికలిపి 15 చొప్పున మొత్తంగా 465 పోస్టులను మంజూరుచేసింది. మొత్తంగా కార్పొరేషన్‌కు 497 పోస్టులను మంజూరు చేసింది. ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడగా ఆ జిల్లాలకు సైతం పోస్టుల మంజూరు కోసం గతంలోనే కార్పొరేషన్ ఎండీ ప్రతిపాదనలు పంపారు. అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
కార్పొరేషన్ ఎండీ మినహా జీఎం, ఈడీ, ఏఈవో, జూనియర్ అసిస్టెంట్ స్థాయివరకు నియామకాలకు గతంలోనే ప్రత్యేక నిబంధనలకు రూపొందించారు. జీఎం పోస్టును అర్హులైన ఈడీలకు ప్రమోషన్ కల్పించడం ద్వారా భర్తీ చేయాలి. కార్పొరేషన్లో అందుకు సంబంధించి అర్హులు లేకుంటే ఎస్సీడీడీలో ఏడీ, జేడీ స్థాయి అధికారులతో నింపాలి. ఈడీ పోస్టును పూర్తిగా ప్రమోషన్ల ద్వారానే భర్తీచేయాలి. ఇందులో 50% ఈడీ పోస్టులను పూర్తిగా కార్పొరేషన్ సిబ్బందితోనే భర్తీచేయాలి. మిగిలిన 50% పోస్టులను వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది నుంచి డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నది.
అందుకు ప్రత్యేక కారణమున్నది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సబ్సిడీ రుణాలను, వ్యవసాయాభివృద్ధి, పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, రూరల్ డెవలప్మెంట్, వివిధ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ తదితర ప్రత్యేక ప్రోగ్రాంలను అమలుచేస్తుంటారు. ఈ నేపథ్యంలో అవసరాల మేరకు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను నియమించుకునేందుకు అవకాశముండేలా ఆ నిబంధనను పొందుపరిచారు. కానీ, అందుకు విరుద్ధంగా ముందుకుపోయేలా కసరత్తు చేస్తున్నారు. 50% పోస్టులను వివిధ శాఖలతో కాకుండా కేవలం ఎస్సీడీడీకి సంబంధించిన అధికారులతోనే భర్తీచేయాలనే ప్రతిపాదనలను తెరమీదకు తీసుకొచ్చారు. అదే జరిగితే, కార్పొరేషన్ నిర్వీర్యం ఖాయమని దళితసంఘాలు, పలువురు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కార్పొరేషన్‌కు సంబంధించిన 50% పోస్టులను ఎస్సీడీడీకి బదలాయింపు ప్రతిపాదనల వెనక భారీకుట్ర దాగి ఉన్నదని కార్పొరేషన్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి 33 జిల్లాలున్నా ఎస్సీ డీడీకి సంబంధించి 10 జిల్లాలకు మాత్రమే డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు మంజూరై ఉన్నాయి. 23 జిల్లాలకు ఎస్సీడీడీకి సంబంధించిన పోస్టులే లేవు. ప్రస్తుతం ప్రమోషన్ల ద్వారా ఈడీ పోస్టులను భర్తీచేయాలనే నిబంధనను అవకాశంగా తీసుసుకుని ఇప్పటివరకు ఎస్సీడీడీ అధికారులతోనే జిల్లాల్లో ఈడీ పోస్టులను భర్తీచేస్తున్నారు. ఫలితంగా కార్పొరేషన్లో అనుభవజ్ఞులైన ఈవోలు సంవత్సరాలుగా ఈడీలుగా ప్రమోషన్లను పొందలేకపోతున్నారు.
ఈ ఒక్కకారణంతోనే కార్పొరేషన్లో ఉద్యోగుల ప్రమోషన్లు లేకుండానే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జీఎం పోస్టును సైతం అర్హులైన ఈడీలు ఉన్నా వారిని పక్కనపెట్టి ఎస్సీడీడీకి చెందిన ఓ ఏడీతో డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనిని కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఏవిధంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్‌కు పేరుకు ప్రత్యేకంగా సర్వీస్ నిబంధనలున్నా, అజమాయిషి మొత్తం ఎస్సీడీడీదే. ఇప్పటివరకు దొడ్డిదారిన ఈడీ పోస్టులను కొల్లగొట్టిన పలువురు ఎస్సీడీడీ అధికారులు ఇప్పుడు ఏకంగా 50% కార్పొరేషన్ పోస్టులను గంపగుత్తగా బదలాయింపునకు తెరతీసినట్టు అర్థమవుతున్నది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం పంపినట్టు కార్పొరేషన్ ఉద్యోగులే వెల్లడిస్తున్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వర్తించిన కరుణాకర్ గత సంవత్సరం ఉద్యోగ విరమణ పొందారు. నాటినుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నది. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ (ఐఎఫ్ఎస్)ను ఇన్చార్జ్జ్ ఎండీగా వ్యవహరించారు. ప్రస్తుతం క్షితజ స్థానంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డిని కమిషనర్‌గా నియమిస్తూ, కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ నియామకాన్ని ఇప్పటికే మంత్రి సైతం వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ గత మే నెలలో ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఎస్సీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్‌కు జీఎంగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
వాస్తవంగా ఎస్సీ కార్పొరేషన్లో జీఎం పోస్టుకు అర్హులైన సీనియర్ అధికారులు ఉన్నారు. 20 ఏండ్లుగా కార్పొరేషన్ ఈడీగా వ్యవహరిస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారి ప్రమోషన్ జాబితాలో ముందున్నారు. అదే విధంగా మరో మహిళా అధికారితోపాటు, మరొకరు సైతం సీనియారిటీ జాబితాలో ఉన్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లను కల్పించ లేదు. ఇటీవలనే జీఎం పోస్టును సైతం డిప్యూటేషన్‌పై ప్రభుత్వం భర్తీచేసింది. మిగతా పోస్టులను సైతం డిప్యూటేషన్‌పై భరీక్తి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.