ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు. నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ అరాచక పాలనను ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ప్రజలకు దొరికిన చక్కని అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని చెప్పాలి. ఎందుకంటే, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ప్రజా పాలన, ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అని ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తులను అరెస్టులు చేస్తుండటం, నిర్బంధిస్తుండటం శోచనీయం. రాష్ట్రంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా కల్పించడం లేదీ ప్రభుత్వం. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హైడ్రాను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విరుచుకుపడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ సోదరుల ఇండ్లకు వర్తించని హైడ్రా పేదలపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నది. బుల్డోజర్ ఎప్పుడు వస్తుందోనని, తమ ఇండ్లను ఎప్పుడు నేలమట్టం చేస్తుందోనని నగరంలోని పేద ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ప్రభుత్వాలంటే పేద ప్రజలకు భరోసా కల్పించేలా ఉండాలి కానీ, గుదిబండలా మారకూడదు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు గుదిబండ వలెనే తయారైంది. ఇదిలా ఉంటే, హైడ్రా పుణ్యాన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్రంగం కుదేలైంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు తమ ఆస్తులను సైతం అమ్ముకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. బయట అప్పు పుట్టక, ఉన్నది అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుండటం బాధాకరం. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామా అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత ఎప్పుడు పెడుదామా అని చూస్తున్నారు. ఆ అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు దక్కడం వాళ్ల అదృష్టంగా భావించాలి.
– మిద్దె సురేష్ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు