కార్పొరేషన్, నవంబర్ 6 : కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ పదవుల గోలే తప్ప రైతుల బాధలు, గోసలు కనిపించడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా క్షేత్రస్థాయిలో భరోసా కల్పించలేదని మండిపడ్డారు. అసలు జిల్లా పరిస్థితి అనాథలాగా మారిందన్నారు. మొంథా తుపానుతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం క్రితం కురిసిన అకాల వర్షాలతో ఉమ్మడిజిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని, చొప్పదండి నియోజకవర్గంలోనే సుమారు 34వేల ఎకరాల్లో వరి దెబ్బ తిన్నదని ఆవేదన చెందారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నదని ఆగ్రహించారు. రైతులు గోస పడుతున్నా జిల్లా ఇన్చార్జి మంత్రి ఇప్పటి వరకు ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. కనీసం క్షేత్రస్థాయిలో పంట నష్టంపై అడిగిన పాపాన పోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నాయకులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులతో మమేకమయ్యారని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని గుర్తు చేశారు.
కేసీఆర్ సీఎం హోదాలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు నష్టపరిహారం అందించారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే వారు కరువయ్యారని, రెండేళ్ల నుంచి వర్షాలతో రైతులు బాధలు పడుతున్నా నేతలెవరూ కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లను ప్రారంభించలేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు కనీసం 30 శాతం కూడా ప్రారంభానికి నోచులేదన్నారు. మొత్తం 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి కనీసం 10 వేల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనేదిలేదని రైస్ మిల్లర్లు చెబుతున్నారని, అయితే ఎవరు కొనాలని ప్రశ్నించారు. పంట నష్టం విషయంలో తూతూమాత్రంగా సర్వే చేయడం తప్ప పూర్తిస్థాయిలో సర్వే చేయడం లేదని మండిపడ్డారు. దయచేసి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని, తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు.