EX MLC Jeevan reddy | ధర్మపురి, అక్టోబర్ 21 : అయ్యా.. మంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏమిటీ..? అసలు కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం ఏమిటీ..? పార్టీ పిరాయింపుదారుల ముందు మేం తలవంచుకొని బతకాల్నా..? పిరాయింపుదారులు, వలసదారులు చెబితేనే పనులు చేస్తారా..? పనులు గానీ పదవులు గానీ ఇతరులకే కట్టబెడతారా.. ఎవరు ఈ గౌరిశంకర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.?… అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బీర్పూర్ మండల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారశైలిపై మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచలేరన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మా పరిస్థితి అజ్ఞాతవాసంతో ఉన్నట్టుగా ఉందన్నారు. బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ కమిటీ నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో పార్టీ నాయకులకు పదవులు కట్టబెడతారా..?
దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, పార్టీలో విధేయతగా పనిచేస్తున్న కార్యకర్తలను కాదని జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపుదారులు చెప్పిన వారికి, మరో పార్టీ నాయకులు, కార్యకర్తలకు పదవులు కట్టబెడతారా..? అంటూ నిలదీసారు. ఒక్క పెంబట్ల దేవాలయ కమిటీ తప్పా అన్ని దేవాలయాల కమిటీలు ఇతర పార్టీ నాయకులకు కట్టబెట్టారన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారిని కాదని పిరాయింపుదారులు చెప్పిన మాటలు వింటారా?…ఇలా అయితే పార్టీలో మా పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నించారు.
పార్టీలో రాహుల్ గాందీ అడుగుజాడల్లో నడుస్తున్నామనీ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులమని, కౌలుదారులం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళతామన్నారు.
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!