నార్నూర్, అక్టోబర్ 21: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో (Market Yard) దుర్వాసన వెదజల్లుతున్నది. దీంతో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు వాసన తట్టుకోలేక ముక్కులు మూసుకుని సమావేశాన్ని కొనసాగించారు. మార్కెట్ పరిసర ప్రాంతంలో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పశువులను వధించి పడేస్తున్న వ్యర్థాలను, మందుబాబులు మద్యం సేవించి పడేసిన సీసాలు, ఆవరణలోనే మల విసర్జన చేస్తుండడంతో ఎందుకు పట్టించుకోవడం లేదని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్‌ను నిలదీశారు. ఉప మార్కెట్ యార్డుకు వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తున్నదని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉందని ఆరోపించారు. కనీసం గేటు మరమ్మతు చేపట్టని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అంటూ పలువురు నాయకులు మండిపడ్డారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్కెట్ యార్డులో వసతులతో పాటు పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించేలా చూడాలని ప్రారంభానికి వచ్చిన నాయకులు అభిప్రాయపడ్డారు.