Air Purifying Plants | ప్రపంచం రోజు రోజుకీ అన్ని రంగాల్లోనూ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మరో వైపు అంతే వేగంగా కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని దేశాలను కాలష్య సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా గాలి కాలుష్యం రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో కాలుష్యభరితమైన గాలిని పీలుస్తున్న ప్రజలు అనేక రకాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం నగరాల్లో మాత్రమే ఉండే కాలుష్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. దీని వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. అయితే గాలి కాలుష్యాన్ని అరికట్టాలంటే అందుకు మొక్కలను పెంచడం ఒక్కటే మార్గం. ఈ క్రమంలోనే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల గాలి కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. గాలి శుభ్రంగా మారుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు.
బోస్టన్ ఫెర్న్ అనేక మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుభ్రం చేస్తుంది. అలాగే గాలిలో ఉండే బెంజీన్, జైలీన్ వంటి సమ్మేళనాలను సైతం నిర్మూలిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. దీనికి వారంలో ఒకసారి నీటిని పోస్తే చాలు, చాలా సులభంగా పెరుగుతుంది. అలాగే స్పైడర్ ప్లాంట్ అనే మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ మొక్క గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. ఈ మొక్కలను చాలా సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. వీటి సంరక్షణ కూడా చాలా సులభమే. కిటికీల వద్ద లేదా ఎండ తగిలేలా ఈ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఇవి సులభంగా పెరుగుతాయి.
వీపింగ్ ఫిగ్ అనే మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఈ మొక్కలను చక్కగా సంరక్షిస్తే 2 అడుగుల నుంచి 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటిని కూడా చాలా సులభంగా పెంచవచ్చు. పెద్దగా సమయం కేటాయించాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లో లేదా ఇంటి బయట ఈ మొక్కలను పెంచవచ్చు. అయితే సూర్యరశ్మి తగిలేలా ఈ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. ఒకసారి ఈ మొక్కకు నీటిని పోస్తే పూర్తిగా తడి ఆరిపోయే వరకు నీటిని పోయాల్సిన పని ఉండదు. అందువల్ల చాలా సులభంగా ఈ మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే గాలి శుభ్రంగా మారుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. అదేవిధంగా గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీ అనే మొక్క కూడా మేలు చేస్తుంది. ఇది కేవలం గాలిని శుభ్రం చేయడం మాత్రమే కాదు, అందమైన పూలను కూడా పూస్తుంది. ఇవి సువాసనను వెదజల్లుతాయి. గాలిలో ఉండే కాలుష్య కారకాలు, ఆర్గానిక్ సమ్మేళనాలను ఈ మొక్కలు తొలగిస్తాయి. ఈ మొక్కలను చాలా సులభంగా పెంచవచ్చు.
ఇంగ్లిష్ ఐవీ అనే మొక్క కూడా గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. దీన్ని అలంకరణ కోసం కూడా పెంచుకోవచ్చు. కానీ సూర్యరశ్మి తగిలేలా ఈ మొక్కను పెంచాల్సి ఉంటుంది. నీళ్లను తరచూ పోయాల్సిన పని ఉండదు. ఎప్పుడో ఒకసారి నీళ్లను పోసినా చాలు, చాలా సులభంగా ఈ మొక్క పెరుగుతుంది. ఇలా ఆయా రకాల మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొలగిస్తాయి. మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. అయితే కొన్ని రకాల మొక్కలు అలర్జీని కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక అలర్జీలు ఉన్నవారు లేదా పిల్లలు ఉన్నవారు ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.