STU | జగిత్యాల, జూన్ 09 : గత 78 ఏళ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ కీలక పాత్ర పోషించి, 79వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చారిత్రకమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చశంకర్, బైరం హరికిరణ్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక విద్యానగర్లోని ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షులు మచ్చ శంకర్ ఆధ్వర్యంలో సంఘ పతాక ఆవిష్కరణ చేసి 79 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
అనంతరం జరిగిన ద్వితీయ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ నిజాం ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి మగ్దూం మొయినుద్దీన్ ఆధ్వర్యంలో 1947 జూన్ 9న స్టేట్ టీచర్స్ యూనియన్ ఆవిర్భవించిందన్నారు. అప్పటినుండి నిరంతరం ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూ మొదటగా పీఆర్సీ డీఏ, పెన్షన్లను సాధించి పెట్టిన సంఘం ఎస్టీయూ అని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా, అలాగే భౌతికశాస్త్రం, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లు ప్రతీ ఉన్నత పాఠశాలలో ఉండాలని మొదటగా చెప్పి దానిని సాధించిన సంఘం ఎస్టీయు అన్నారు. ఉపాధ్యాయులకు అప్రెంటీస్ విధానాన్ని రద్దు చేయించిన ఘనత ఎస్టీయూ దేనని అన్నారు.
ఈ విధంగా ఉపాధ్యాయుల హక్కులు, బాధ్యతలు సంక్షేమం, పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తూ పేద విద్యార్థుల ఉన్నతిని ఆకాంక్షిచే సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్ అని, ఎస్టీయూ ముందు తరం నాయకులైన కాళోజీ, ప్రో.జయశంకర్ సార్, పూర్వ ఎమ్మెల్సీలైన వి పి రాఘవాచారి, వాణి విజయ రామారావు,శ్యాం సుందర్, రామమూర్తి అలాగే రాష్ట్ర, జిల్లా పూర్వ అధ్యక్ష కార్యదర్శుల బాటలో నడిచి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతూ సీర్నాంచ రవీందర్, పాలెపు శివ రామకృష్ణలు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వ్యవస్థతో నేడు సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని, గత ఎమ్మెల్సీలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉపాధ్యాయ వ్యవస్థను చులకన చేస్తూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం భావితరానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఆర్థికేతర అంశాలైన 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, పెండింగ్ డీఏలను మంజూరు చేసి వెంటనే మంచి పిఆర్సి ప్రకటించాలని, వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, పాఠ్యపుస్తకాల కరికులం మార్చాల్సిన అవసరం ఉందని వారు ద్వితీయ కార్యవర్గ సమావేశంలో సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు బండి శ్రీనివాస్, మేకల ప్రవీణ్, సిరిపురం రాజేష్, ఊరడి ప్రభాకర్, ఏగ్యారపు వెంకటేష్, గుండెల నరేష్, విద్యామణి కృష్ణ, గుర్రం తిరుపతిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మగ్ధూం మొయినుద్దీన్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, జిల్లాలో ఎస్టియు సీనియర్ నాయకులు రిటైర్డ్ హెడ్మాస్టర్ కన్నోజు ఈశ్వరయ్యను శాలువాతో సన్మానించారు.