జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. దళితులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు.
జగిత్యాల రూరల్ మండల బాలపల్లి గ్రామానికి చెందిన మెడపట్ల శశి కుమార్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన మారుతి ఎర్టిగా వాహనాన్ని లబ్ధిదారునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. దళిత బంధు పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లలో జమ చేస్తున్నామన్నారు.
దళితులు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు మంచి యూనిట్లను ఎంచుకొని ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ప్రజలు ప్రతి పక్ష నాయకుల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దన్నారు.