కోరుట్ల : ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జప్యం చేస్తున్నారని వరి పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మోహన్‌రావుపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్పా ఎక్కడ సమర్థవంతంగా జరగడం లేదని విమర్శించారు.
ఉరుములు, ఈదురు గాలులుతో కూడిన వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దయితుందని రైతులు తీవ్ర నష్టం ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. మరోవైపు నియోజకవర్గంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వలు అలాగే ఉన్నాయని, లారీల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మరో 10 రోజులు గడిస్తే ఇంకా వర్షాలు కురుస్తాయని అప్పుడు ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బస్తాలను రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు చీటీ వెంకట్రావు రైతులు తదితరులున్నారు.