Sonu Sood | సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్లో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సహాయం అందిస్తానని సోనూ సూద్ ప్రకటించారు. విమానాలు రద్దు కావడంతో దుబాయ్లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన వెల్లడించారు. సహాయం అవసరమైన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని, వారికి తక్షణమే సహాయం అందించేలా తన టీమ్ పని చేస్తుందని చెప్పారు.
ఈ సహాయం పొందేందుకు ఎలాంటి షరతులు ఉండవని కూడా సోనూ సూద్ స్పష్టం చేశారు. ఏ దేశానికి చెందిన వారైనా సరే, కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయం అందిస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మనుషులుగా ఒకరికొకరం తోడుగా నిలబడటం చాలా ముఖ్యం. అవసరమైన వారు నా ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ పంపితే మా టీమ్ వెంటనే స్పందిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. సోనూ సూద్ సేవా కార్యక్రమాలు కొత్తేమి కావు. ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు వేలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సోనూ సూద్ ప్రత్యేకంగా బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి లక్షలాది మందిని వారి స్వస్థలాలకు చేరవేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆ సేవల కారణంగా ఆయనను ప్రజలు “రియల్ హీరో”గా అభివర్ణించారు.
ఇప్పుడు విదేశాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ, మానవత్వానికి ప్రతీకగా సోనూ సూద్ నిలుస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయిన పలువురు ప్రయాణికులు ఆయన ప్రకటనపై ఆశాభావం వ్యక్తం చేస్తూ, సహాయం కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షోభ సమయాల్లో కూడా మానవత్వం చాటుకునే వ్యక్తులు సమాజానికి నిజమైన ప్రేరణ అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.