ఇబ్రహీంపట్నం, జూన్ 03: రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ (Congress) అన్నదాతలకు చేసిందేం లేదని ఇబ్రహీంపట్నం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొక్కజొన్న పంటకు మందు పెట్టే సమయం మించిపోతున్నా యూరియా (Urea) లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల కేంద్రంలోని సహకార సంఘానికి బుధవారం రాత్రి 450 యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో గురువారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో రైతులు సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. సుమారు 550 మంది రైతులు ఉదయం 5.30 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే సహకార సంఘం నిర్వాహకులు ఒక్కొక్క రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియాను అందించడంతో.. దొరకనివారు నిరాశతో వెనుతిరిగారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని వేడుకున్నారు.
వర్షాకాలం ఆరంభంలోనే యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. అన్నదాతలు పొద్దంతా సొసైటీల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల పోలీస్ పహారా మధ్య పంపిణీ చేస్తున్నారు. పల్లెల్లో మళ్లీ ఉమ్మడి పాలన నాటి దృశ్యాలు కన్పిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద పాస్బుక్ జిరాక్స్లు వరుసలో ఉంచి పడిగాపులు కాశారు. ఆలూరు మండలం ఇస్సాపల్లి సొసైటీ వద్ద 200 మందికిపైగా కర్షకులు పొద్దంతా వేచి ఉన్నారు. చెట్ల కొమ్మలు, బండరాళ్లు వరుసలో పెట్టి నిరీక్షించారు. 450 బస్తాలు మాత్రమే రాగా, కొందరికే సరఫరా చేశారు. మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు.
పోలీసు భద్రత మధ్య పంపిణీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కొందరికి మాత్రమే అందడంతో రైతులు ఆందోళనకు దిగి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బుధవారం అధికారులు పోలీసు భద్రత మధ్య టోకెన్ల ద్వారా పంపిణీ చేశారు. కాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, రైతు వేదికల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.
యూరియా వచ్చిందని తెలియగానే పట్టాదారు, ఆధార్ జిరాక్స్ పత్రాలతో తరలివచ్చారు. ఒక్కొక్కరికీ రెండు బస్తాలు మాత్రమే, అదీ కూడా ఆలస్యంగా పంపిణీ చేస్తుండటంతో రైతులు అధికారులను నిలదీశారు. రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ పోలీసు సిబ్బందితో అక్కడికి వచ్చి రైతులను సముదాయించారు. హమాలీలు లేకపోవడంతో మిగతా సగం యూరియా పంపిణీ నిలిపివేశారు. వెంటనే పంపిణీ చేయాలని రైతులు పట్టుబట్టడంతో టోకెన్లు ఇచ్చి గురువారం రావాలని అధికారులు పంపించారు.