Ramayanam | నాకు తొమ్మిదేళ్లప్పుడు మా ఇద్దరు మేనవదినల పెళ్లిళ్లు జరిగాయి. ఆ తర్వాత చాలారోజుల దాకా మా దగ్గరివాళ్ల పెళ్లిల్లేవీ నేను చూడలేదు. లేకపోతే జరగలేదు అనుకుంటానేమో కూడా! నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసాక.. ఆ ఎండాకాలం రోజుల్లో నాతోపాటు పదోతరగతి చదివిన చాలామంది అమ్మాయిల పెళ్లిళ్లు అయ్యాయి. అందులో బాగా గుర్తున్నది రాధ పెళ్లి.
అప్పట్లో మరెందుకో పదో తరగతి కాగానే పెళ్లిళ్లు చేసేవారు. పోనీ ‘ఫెయిల్ అయితే నీ పెళ్లి చేస్తా చూడు’ అన్నట్లు కూడా కాదు. పాసైనా చేసేవారు. చక్కగా చదువుకుంటూ, స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకొంటూ, నచ్చిన ఆటలు ఆడుకుంటూ, వచ్చిన సిన్మాలు చూసుకుంటూ ఉంటే.. ఈ పెద్దవాళ్లున్నారు చూసారూ, మహా సాడిస్టులు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు గబగబా ఎవడ్నో ఒకడ్ని వెతికి తెచ్చి పెళ్లి చేసేవారు. అవి ముమ్మాటికీ బాల్యవివాహాలే!
ఎనిమిదో తరగతి దాకా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. అందరితోనూ నేను బాగానే ఉండేదాన్ని. పరీక్షల్లో “రమా! అబ్బ ప్లీజ్! ఒక్క ఆన్సర్ చెప్పవానబ్బా!” అన్నవాళ్లందరికీ జవాబులు చెబుతూ ఉండేదాన్ని. ముఖ్యంగా ఇన్విజిలేటర్ సార్ డోర్ దగ్గర చాయ్ తాగుతూ ఉన్న సమయంలో సైగలు, గుసగుసల ద్వారా ఆబ్జెక్టివ్ టైపు జవాబులు మొత్తం చెప్పేదాన్ని. సార్ వచ్చి “ఏందమ్మా! ఇది పరీక్ష అనుకుంటున్నవా! రేడియోల ప్రశ్నలు జవాబుల ప్రోగ్రాము అనుకుంటున్నవా!” అని లబలబ మొత్తుకునేవాడు. అలా ‘అందరూ మనవాళ్లే!’ అనే సినిమా నడిచేది.
అయితే.. నాకు నైంత్ క్లాస్ నుండీ రాధ, శ్యామల బాగా దగ్గరి స్నేహితులయ్యారు. అందులోనూ రాధ వాళ్లిల్లు మా ఇంటికి వెళ్లే దారిలోనే గనుక దాదాపు వారానికి రెండుసార్లు వాళ్లింటికి వెళ్లాల్సి వచ్చేది. వెళ్లాల్సి వచ్చేది అని ఎందుకు అన్నానంటే.. తను వాళ్లింటి దగ్గర ఆగగానే నేను ముందుకు వెళ్తుంటే.. “రమా ప్లీజ్! ఇంటికొచ్చి పోరాదే!” అని బతిమిలాడేది.
“అరె! ఇప్పటిదాంక కల్సే ఉన్నం కద! ఇంటికి పొయ్యి హోమ్‌వర్క్ చేసుకోవాలె” అనేదాన్ని. “ఏం హోమ్‌వర్క్‌లే! అయిన నువ్వు ఎంతల జేస్తవ్? అర్ధగంటల గుంజి పడేస్తవు! నీకు కష్టమా! రారాదూ!” అనేది. అప్పటికే నా మనస్సు ఎండలో పెట్టిన ఐస్ఫ్రూట్లాగా కరగడం మొదలయ్యేది. “అట్ల గాదు గని.. ఫెయిర్ నోట్‌బుక్ తెచ్చుకోలే. మా ఇంట్ల కూడా ఎదురుచూస్తుండొచ్చు. నేను పోత!” అనేదాన్ని కొంచెం మొహమాటంగా. “అబ్బ ప్లీజ్! రావోయ్! అయిదే నిమిషాలు కూచొని పోదువు” అని వదలకపోయేది. అలా వారానికి రెండు మూడుసార్లు వాళ్లింట్లో అరగంటో, గంటో గడిపేదాన్ని.
మేమెప్పుడూ కలిసి సినిమాలకు వెళ్లలేదు. అప్పట్లో సొంతంగా షాపింగ్ చేసే అవకాశం మా ఊర్లో పెద్దగా లేదు. స్కూల్ పాఠాల గురించో, మా క్లాస్మేట్స్ గురించో మాత్రమే కాసేపు మాట్లాడుకునేవాళ్లం. కాఫీలు, టీలు కూడా అలవాటు లేదు. వాళ్లమ్మ అప్పుడప్పుడూ ఏ పల్లికాయో, అటుకులో, చేగోడీలో పెట్టేది. నాకు ఎందుకో బాగా మొహమాటంగా అనిపించేది. నేను తిననంటే రాధ ఊరుకునేది కాదు. ఎంతసేపు కూచున్నా మళ్లీ నేను వచ్చేటప్పుడు తను దిగులుగా మొహం పెట్టేది. మేము అతిగా మాట్లాడుకోక పోయినా ఎందుకో బాగా దగ్గరి స్నేహితులం అయిపోయాం.
మేమిద్దరం కలిసి ప్రభాకర్ ఫొటో స్టూడియోకు వెళ్లి ఒక ఫొటో తీసుకున్నాం కూడా. తనకు మెడలో హంసల లాకెట్‌తో ఒక బంగారు గొలుసు ఉండేది. నాకు ఏమీ లేదని ఆ రోజు ఒక పూసల దండ నా మెడలో వేసింది. ఆ ఫొటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. రాధ ఇంటర్లో జాయిన్ అవలేదు. నేను కాలేజీలో చేరాక ఊరికొచ్చినప్పుడల్లా తనను కలుస్తూండేదాన్ని. చలికాలం సెలవులప్పుడు తనకు పెళ్లిసంబంధాలు చూస్తున్నారనీ, ఒక సంబంధం దాదాపు ఖాయమయ్యేట్టుగా ఉందనీ చెప్పింది. తను నాకంటే రెండేళ్లు పెద్దది. అయినా కూడా అప్పుడే పెళ్లా!? అనిపించింది.
“నీకు ఆయన నచ్చాడా?” అడిగాను. నాకు అలాంటి సంభాషణలు అలవాటు లేవు. “మనను ఎవరు అడుగుతరే?” నవ్వింది. ఇన్నేళ్లయినా ఆ మాట నాకు బాగా గుర్తుంది. అవును.. అప్పట్లో ‘అబ్బాయి నచ్చాడా?!’ అని ఆడపిల్లల్ని ఎవరూ అడిగేవారు కాదనుకుంటా. అబ్బాయికి నచ్చితే చాలు. “మా దాంట్ల అందరు బిజినెస్‌లనే ఉంటరు. నాకు మటుకు బాగ చదువుకోని ఉద్యోగం చేసేటోడు కావాల్నని చెప్పిన. ఆ మాటయితే మా నాన విని అట్లనే ఎతికిండు” అన్నది. ఆయన ఇంజినీరింగ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడట. రాధ కోరిక తీరినందుకు సంతోషమే గానీ, ఎందుకో తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందంటే చెప్పరానంత బాధ కలిగింది.
ఆ ఎండాకాలంలోనే తన పెళ్లి. ఇంటికొచ్చాక అన్నం కూడా తినబుద్ది కాలేదు. దిగులుగా ఉంటే అమ్మ ఏమిటని అడిగింది. విషయం చెప్పాను. “ఒక వయసొచ్చినాక ఆడిపిల్లలకు పెండ్లి జేసి అత్తగారింటికి పంపాల్నని ఎవరైనా తొందర పడుతరు. తను గూడ చదువుకుంట లేదు గద! నువ్వు కాలేజీకి వేరే ఊరికి పోతవు గానీ, రాధ మటుకు నువ్వు ఒచ్చినప్పుడల్లా కలువడానికి పెళ్లి చేసుకోకుండా అట్నే ఉండాల్నా?” అంది నవ్వుతూ. నన్ను టీజ్ చేయడానికి అన్నా కూడా నాకు ఉక్రోషం వచ్చింది.
“నేనేం అట్ల అనలేదు. ఇంక కొన్నేండ్లు అయినాక జేసుకుంటే బాగుండు” నాకేమీ పాయింట్ దొరకలేదు. “ఎప్పుడు జేసుకోవాలె? నువ్వు జేసుకున్నప్పుడా! ఎవరికి కుదిరినప్పుడు వాండ్లు చేసుకుంటరు గానీ, వేరే వాండ్ల కొరకు ఆగుతరా?” అమ్మ నవ్వులో కొంటెతనం తెలిసినా నాకు జవాబు తెలియలేదు. మొత్తానికి రాధ నా చేత ఒట్టు వేయించుకుందని.. ఆ మూడు రోజులపాటు రోజూ వెళ్లాను వాళ్లింటికి. ఎన్నో వేడుకలు, కానుకలు, మర్యాదల మధ్య కోలాహలంగా జరిగింది ఆ పెళ్లి. కొన్ని ఆచారాలు నాకు అస్సలు నచ్చలేదు. అప్పగింతలై రాధ వాళ్లాయన చేయి పట్టుకుని వెళ్లిపోతుంటే దుఃఖం వచ్చింది.
ఇంటికొచ్చి బాగా ఏడుస్తుంటే అమ్మ చాలాసేపు ఓదార్చింది. “పిచ్చిదానా! ఎందుకేడుస్తున్నవే? తను మధ్యమధ్య ఇక్కడికి ఒచ్చినప్పుడు కలువొచ్చు. ఉత్తరాలు రాసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటది” అంటూ ఎన్నో ముచ్చట్లు, జోకులు చెప్పి నవ్వించింది. ఒక పెళ్లిలో అన్ని తతంగాలు ఉంటాయని అప్పుడే తెలిసింది. ఆ తరువాత చాలారోజుల దాకా వాళ్లింటి ముందు నుంచి వెళ్తుంటే బాధ కలిగేది. ఒక పెద్ద ఉత్తరం రాసి తనకిచ్చాను. తను నా ఆటోగ్రాఫ్ బుక్‌లో ఏదైనా రాయమంటే వాళ్ల చిన్నాన్నను అడిగి ఆయన చేత రాయించింది.
ఆ ఉద్వేగం కొన్నాళ్లకు మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పటికీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. కలిసినప్పుడు కబుర్లు చెప్పుకొంటాం. తను ఆనందంగా ఉంది. తన కొడుకూ, కోడలూ హైదరాబాద్‌లో డాక్టర్లు. కూతురూ, అల్లుడూ అమెరికాలో ఇంజినీర్లు. అయినా, బాలగంగాధర తిలక్ అన్నట్లు ‘ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందంలాంటి విచారం కలుగుతుంది’ అదంతే!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి