హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 28 : ఎంతో ఘనచరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీ భూములకు రక్షణ కరువైంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం సుమారు 673.12ఎకరాలు సేకరించారు. వాటిలో కుమార్‌పల్లి శివారులో188.28 ఎకరాలు, లష్కర్‌సింగారంలో 309.20 ఎకరాలు, పలివేల్పులలో 175.14ఎకరాలు ఉన్నది. అధికారుల ప్రకారం.. కుమార్‌పల్లిలోని సర్వే నంబర్ 229, లష్కర్సింగారంలోని సర్వే నంబర్ 32, పలివేల్పులలో సర్వే నంబర్లు 412, 413, 414లో భూ ఆక్రమణ జరిగినట్లు గుర్తించి, ఆక్రమణదారులందరికీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి కేయూ భూముల ఆక్రమణ సమస్య తెరపైకి వచ్చింది.
ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని కొత్తగా సర్వే నిర్వహించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాకతీయ యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో వందల ఎకరాలు ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లాయి. అయితే 229 సర్వే నెంబర్లో కేయూ ఉద్యోగులతో పాటు కొందరు పోలీసులు, రాజకీయ నేతలు సుమారు 12 ఎకరాల భూములను కబ్జా చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. కాగా, కేయూ భూముల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా చుట్టూ కాంపౌండ్ నిర్మించేందుకు రూ.10కోట్లు కేటాయించి, ఏడాది దాటినా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. భూముల లెక్కలు తేలినా చుట్టూ కాంపౌండ్ నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది.
కేయూ పాలకమండలి ఆమోదం తెలిపినా పనులకు మోక్షం లభించడంలేదు. వర్సిటీ భూ సమస్యలను పరిష్కరించి కాంపౌండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న బెటాలియన్‌ను రెండేళ్ల క్రితం ఇక్కడి నుంచి మణిపూర్ రాష్ర్టానికి తరలించినా ఇప్పటికీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలేదు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటు కోసం గతంలో కేయూ రెండు ఎకరాలు కేటాయించింది. ఇందులో ఫంక్షన్‌హాల్, హరితహారం నర్సరీని నిర్వహిస్తున్నారు. కేయూ పోలీస్‌స్టేషన్ సైతం ఈ భూముల్లోనే ఉన్నట్లు ఆధారాలున్నా, వాటిని యూనివర్సిటీకి ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. కాగా, కాకతీయ యూనివర్సిటీ భూముల్లోని సీఆర్పీఎఫ్ భూములను వెనక్కి తీసుకోవాలని వీసీ చాంబర్ ఎదుట విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు భైఠాయించి ధర్నా చేపట్టారు.
ప్రభుత్వ ఆధీనంలో ఉంది..
కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మా ణం మా చేతుల్లో లేదు. కేయూ పాలకమండలి సభ్యులు ఆమోదించి కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్లు కేటాయించింది. ఏడాది గడిచినా ఇప్పటికీ వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. కాంపౌండ్ నిర్మాణం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది.
– వల్లూరి రాంచంద్రం, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్