మెదక్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్ర మ కేసులు పెడుతున్నారని, బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని శనివారం ఒక ప్రకటనలో హరీశ్‌రావు మండిపడ్డారు. హైకోర్టు స్టే ఇచ్చినా మల్లికార్జున్ గౌడ్‌పై ఉద్దేశపూర్వకంగా మరో కొత్త కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.
మెదక్‌లో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రోజుకో కేసు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మల్లికార్జున్ గౌడ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకొని, కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల నుంచి మల్లికార్జున్‌గౌడ్ పై నాలుగు తప్పడు కేసులు పెట్టారని, అ కేసుల్లో హైకోర్టు స్టే ఇచ్చినా ఎలాగైనా జైలుకు పంపాలన్న దురుదేద్దశంతో వెంటనే మరో అక్రమ కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ చట్టవిరుద్ధ్దంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు మారాలని, వచ్చేది తమ ప్రభుత్వమని, ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులపై చర్యలు తప్పవని హరీశ్‌రావు హెచ్చరించారు. అక్రమ కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.