అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెండ్లి వేడుక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘రణబాలి’ చిత్రబృందం సినిమాలోని వెడ్డింగ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న పాన్ ఇండియా‘రణబాలి’ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘రణబాలి’లో పెళ్లి వేడుక సందర్భంగా ఈ అందమైన పాటను తెరకెక్కించారు.
18వ శతాబ్దం నాటి వివాహ సంప్రదాయాలకు అద్దం పడుతూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. ‘ఏందయ్య సామీ…ఇట్ట కాస్తాందీ వెన్నెల, ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే జాముకి మందుపెట్టిందెవ్వరు..’ అంటూ చక్కటి ప్రణయభావాలతో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. అజయ్-అతుల్ ఈ గీతాన్ని స్వరపరిచారు. 1854-1878 మధ్య బ్రిటీష్ కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్, కథ, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.