కథలాపూర్, ఏప్రిల్ 15 : కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ఆరబోస్తూ ఓ రైతు గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూర్లో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దూలూర్ గ్రామానికి చెందిన పూండ్ర జలపతిరెడ్డి(50) గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రంలో పోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు.
ధాన్యాన్ని ఆరబోస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో అతనికి గుండెపోటు వచ్చిందని గమనించిన అక్కడున్న రైతులు సీపీఆర్ చేసి, చికిత్స కోసం కథలాపూర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జలపతిరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.