కోరుట్ల, సెప్టెంబర్ 23 : టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనందించేందుకు దాతలు సహకరించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళ శక్తిలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహారంతో పాటు న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి పీడితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. రోగులకు పొష్టికాహారం ఇచ్చేందుకు దాతలు కూడా ముందుకు వచ్చి చేదోడు వాదోడుగా నిలవాలన్నారు.
టీబీ బాధితులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. పేద రోగులకు దాతల సేవలు ఎంతో ఉపయోగ పడతాయని వ్యాధిగ్రస్థులందరికి నిక్షయ మిత్రగా ముందుకు రావాలని కోరారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు ముందుకు వచ్చి వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలన్నారు. క్షయ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, ఇమ్యునైజెషన్ అధికారి ఆకుల శ్రీనివాస్, ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ వై అనూప్ రావ్ , కోరుట్ల అధ్యక్షులు డాక్టర్ రేగొండ రాజేష్, వైద్యులు వినోద్, లక్ష్మీ, డిపిఓ తులసి రవీందర్, సీసీ కుతుబొద్దిన్, సూపర్ వైజర్ మంకిడి శ్రీనివాస్, డిపిపిఎం హరీష్, మల్లికార్జున్, టీబీ ల్యాబ్ సూపర్వైజర్ రియాజ్, ఫార్మసీ ఆఫీసర్ ఉదయ్ ప్రసాద్, సూపర్వైజర్లు ఇమ్రాన్, ఆంజనేయులు రబ్బానీ, ఆశ వర్కర్లు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.