అమరావతి : ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ( Coalition Government ) సక్రమంగా అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. కూలీలకు పని దినాల పెంపులో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు . వైఎస్సార్ హయాంలో ఆనాడు 1.10 కోట్ల జాబ్ కార్డులు ఉండేవని , ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల కార్డులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఏదో ఒక సాకుతో భారీగా కార్డుల కోత పెడుతున్నారని ఆరోపించారు .
గత ఏడాదిలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. మన్రేగా చట్టం ప్రకారం వంద రోజుల పని వందశాతం ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి ఏడాది పట్టుమని 52 రోజులు కూడా ఇవ్వడం లేదన్నారు. వంద రోజులు కూడా పని ఇవ్వలేని వాళ్లు 125 రోజులు పని ఇస్తామని అంటే నమ్మగలమా? అంటూ ప్రశ్నించారు.