పెగడపల్లి: కాళేశ్వరంపై (Kaleshwaram) కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని, కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ తప్పుడు నివేదికలపై మండిపడ్డారు. పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మానేరు నీటిలో పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. ఈ మల్లారెడ్డి మాట్లాడుతూ.. వృథాగా పోయే గోదావరి జలాలను ఎత్తిపోసి మిడ్ మానేరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ సాగర్‌కు తరలించడం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాదా అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామగ్రామాన కాళేశ్వరం ప్రాజెక్టుకు గొప్పతనాన్ని వివరించాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.