నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 21: యూరియా యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. యాప్ వినియోగం తెలుస్తలేదని, ఒక వేళ యాప్ ఓపెన్ చేసినా స్టాక్ క్షణాల్లో మాయమవుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు శనివారం నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. యూరియా దొరకడం లేదంటూ రైతులు నల్లగొండ జిల్లా వేముపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట అద్దంకి -నార్కట్‌పల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్‌లో యూరియా బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే సెకండ్లలోపే స్టాక్ ఖాళీ అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
పాత పద్ధతిలోనే యూరియాను నేరుగా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. చిట్యాల మండలం వెలిమినేడు సొసైటీ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. 560 బస్తాల యూరియా ఆన్లైన్లో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ చూపించడంతో రైతులు సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. ఆన్లైన్లో ఉంచిన ఐదు నిమిషాలకే ఎలా అయిపోతుందని, సరైన సమయంలో యూరియా వేయకపోతే పంటలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పీఏసీఎస్ ఎదుట రైతులు నిరసనకు దిగారు.
యాప్ ద్వారా పంపిణీ ప్రక్రియ గందరగోళంగా ఉన్నదని మండిపడ్డారు. యాప్ ద్వారా యూరియా బుక్ కావడం లేదంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో రైతులు రోడ్డెక్కారు. 200 మంది రైతులు వీణవంక-కరీంనగర్ రహదారిపై దాదాపు గంటసేపు బైఠాయించారు. చల్లూరు సింగిల్‌విండోలో యూరియా ఉన్నదని యాప్‌లో చూపిస్తే బుక్ చేసుకున్నామని, సింగిల్ విండోకు వెళ్లి అడిగితే ఇప్పుడిస్తం.. అప్పుడిస్తం అని చెప్తున్నారే గానీ, 10.30 గంటలు దాటినా ఇవ్వలేదని మండిపడ్డా రు. యాప్‌పై అవగాహన లేక యూరియా అందక పంట ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో పీఏసీఎస్ కార్యాలయం ముం దు రైతులు వినూత్న నిరసనకు దిగారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు మెడలో ఉరి తాడు వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని సర్కార్ యాప్ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపిందని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్ విమర్శించారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పెరుమాళ్ల సతీష్‌కుమార్, పోతుగంటి మధు పాల్గొన్నారు.