హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు దుర్భరంగా మారాయి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చెమటోడ్చుతున్నా.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వారికి వేతన వెతలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి 8 నుంచి 10 నెలలుగా జీతాలు అందడం లేదు.
దీంతో పిల్లల సూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, డీఆర్డీవో, మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కంప్యూటర్ ఆపరేటర్లకు అక్టోబర్ నుంచి జీతాలు నిలిచిపోయాయి. జీ రామ్ జీ(ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్నా.. వారి కష్టానికి ప్రతిఫలం దకడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ-పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లో పంచాయతీ ఆపరేటర్లు జనన, మరణ ధ్రువీకరణలు, ఆస్తిపన్ను నమోదు, పారిశుద్ధ్య సంబంధిత ఆన్లైన్ పనులు, ప్రభుత్వ పథకాల డాటా ఎంట్రీ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పనిభారంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చే వేతనం కూడా సక్రమంగా రావడం లేదని వాపోతున్నారు.
‘పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ లో మొత్తం 92,175 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రీన్చానల్ ద్వారా ప్రతినెలా క్రమంతప్పకుండా వేతనాలు చెల్లిస్తాం’అని ఆ శాఖ మంత్రి సీతక్క ఏడాది క్రితమే హామీ ఇచ్చారు. కానీ, నేటికీ మంత్రి హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆ తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా శాఖలవారీగా ఉద్యోగుల ఆధార్ వివరాలను కూడా సేకరించారు. అయినా, నేటికీ చిరు ఉద్యోగులకు నెలనెలా వేతనాలు అందక, కుటుంబాలు గడువక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలతోపాటు అన్ని వసతులు సమకూరుతున్నాయి. వారితో సమానంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మీద సర్కార్ శీతకన్ను చూపిస్తున్నది. ఆ శాఖల హెచ్వోడీలను వేతనాల గురించి అడిగితే, ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెప్తున్నారు. పనిచేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోండని బెదిరిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు పంపించడం లేదని తెలిసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల అంచనాల నిధులను ప్రతిపాదించాలి.
-తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి