నిన్నటి వరకు మనం ‘హే సిరి’ అనో.. ‘అలెక్సా’ అనో పిలిచి అది చెయ్.. ఇది చెయ్.. అంటూ అడిగేవాళ్లం!! కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! మీ ఫోన్లో ఉండే ఓ సాఫ్ట్వేర్ లేదా వెబ్‌సర్వీస్ మిమ్మల్ని పిలుస్తున్నది. ‘నాకు ఈ పని చేసిపెట్టు.. నీకు ఇంత కూలీ ఇస్తాను’ అని బేరం కూడా ఆడుతుంది. వినడానికి ఇది ఏదో ‘బ్లాక్ మిర్రర్’ వెబ్ సిరీస్‌లో సీన్లా ఉంది కదా? కానీ, మీరు చదివింది నిజం. కొన్ని ఏఐ స్టార్టప్స్ దీన్ని నిజం చేస్తున్నాయి. బాస్‌గా ఏఐ, పనివాడిగా మనిషి!! టెక్నాలజీ చరిత్రలోనే అత్యంత వింతైన ఈ ‘రివర్స్ గేర్’ ప్రయాణం మొదలవుతున్నది. యంత్రాలకు మనం ‘హార్డ్‌వేర్’గా మారిపోతున్నామా? ఈ వినూత్న పోకడ వెనక ఉన్న నిజాలేంటో చూద్దాం.
ఇప్పటివరకు మనం ఏఐని గట్టిగా వాడుకున్నాం. మన పనులు చేసిపెట్టమని ఆర్డర్లిస్తూ వచ్చాం. ఇప్పుడు అదే ఏఐ మిమ్మల్ని అద్దెకు తీసుకుంటున్నది. మీకు పని పురమాయిస్తున్నది. చివరికి జీతం కూడా ఆఫర్ చేస్తున్నది. అంతేకాదు.. ‘వింటారా? లేదా?’ అంటూ.. ‘నాకు మీ శరీరం కావాలి.. ఎందుకంటే ఏఐగా నేను గడ్డిని తాకలేను, పూల పరిమళాన్ని ఆస్వాదించలేను.. కానీ మీరు చేయగలరు’ అనే వింత ఆర్డర్లు చెబుతున్నది. ఇందంతా చూస్తుంటే.. నేటి టెక్నాలజీ వరల్డ్‌లో ఊహకందని మార్పు చోటు చేసుకుంటున్నదని ఒప్పుకోక తప్పదు.
నిజానికి మనం నిన్న మొన్నటి వరకు ఏదైనా యాప్ ద్వారా పనివాళ్లని వెతుక్కోవడం చేశాం. కానీ, ఇక్కడ ఏఐ ఏజెంట్లు మనుషుల ప్రొఫైల్స్ చూసి, తమకు కావాల్సిన వ్యక్తిని బుక్ చేసుకుంటున్నాయి. మిమ్మల్ని అనలైజ్ చేస్తాయి. దేనికి పనికొస్తారో చెక్ చేశాక.. మీకో రేటుని కూడా నిర్ణయిస్తాయి.
మనుషులే ‘హార్డ్‌వేర్’: ప్రస్తుతం నెట్టింట్లో రూపొందించిన కొన్ని వెబ్సైట్లు వింతైన లాజిక్‌తో పనిచేస్తున్నాయి. ఏఐకి తెలివితేటలు ఉన్నాయి కానీ, దానికి భౌతిక శరీరం లేదు. అందుకే బయటి ప్రపంచంలో ఏదైనా పని చేయాలంటే అది ఒక మనిషిని అద్దెకు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నది. అంటే.. ఇక్కడ మనిషి కేవలం ఏఐకి ఒక ‘హార్డ్‌వేర్’ లాగా పనిచేస్తాడన్నమాట.
పని విధానం: ఏఐ ఏజెంట్లు మనుషుల స్కిల్స్, లొకేషన్ చూసి టాస్క్ అసైన్ చేస్తాయి. పని పూర్తయ్యాక క్రిప్టో కరెన్సీ రూపంలో పేమెంట్ కూడా చేస్తాయి.
ఈ తరహా ప్లాట్‌ఫామ్ (https://rentahuman.ai) లాంచ్ అయ్యిందే ఆలస్యం. కొన్ని గంటల్లోనే వందల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో కంటెంట్ క్రియేటర్ల నుంచి స్టార్టప్ సీఈఓల వరకు ఉండటం విశేషం.
ఏ పనులు చేస్తారు?: ఏఐకి బయటి ప్రపంచంలో ఏదైనా వస్తువును చూడాలన్నా, ఎవరికైనా ఏదైనా అందజేయాలన్నా ఈ ‘రెంటెడ్ హ్యూమన్స్’ సాయం తీసుకుంటుంది.
జీతం ఎంత?: ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో గంటకు సుమారు 50 నుంచి 69 డాలర్ల (దాదాపు రూ. 4000 – రూ. 6000) వరకు రేట్లు నడుస్తున్నాయి.
పెత్తనం ఎవరిది?: మనిషిని ఏఐ నియంత్రించడం అంటే.. భవిష్యత్తులో యంత్రాల పెత్తనం పెరిగిపోతుందా? అనే చర్చకు ఇది తెరలేపింది.
మనిషి టెక్నాలజీని సృష్టించాడు. ఇప్పుడు ఆ టెక్నాలజీయే మనిషిని ఒక పరికరంలా వాడుకుంటున్నది. ఇది విప్లవమా లేక విపత్తా అనేది కాలమే నిర్ణయిస్తుందని పలువురు విశ్లేషకుల మాట. ఈ ‘రెంట్ ఏ హ్యూమన్’ లాంటి వెబ్సైట్లు ప్రయోగాత్మకమైనవే అయినప్పటికీ, ఇదొక భయంకరమైన నిజాన్ని మనకు చెబుతున్నది. భవిష్యత్తులో మనం కేవలం ఏఐ ఆర్డర్లను పాటించే ‘రోబో-మనుషులం’గా మారిపోతామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమేషన్ అంటే మనుషుల పనిని యంత్రాలు చేయడం అనుకున్నాం.. కానీ ఇక్కడ యంత్రాల పనిని మనుషులు చేయడం అనేది ఊహకు అందని విషయం.
ఇప్పటివరకు కంపెనీలు మనల్ని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు మనకు ఒక గుర్తింపు ఉండేది. కానీ, ఇక్కడ ఏఐకి మనం కేవలం ఒక ‘Physical Actuator’ (భౌతికపరమైన పరికరం) మాత్రమే. ఈ ప్లాట్ఫామ్లో రిజిష్టర్ అయిన వారిని ‘Meatspace Layer’ అని పిలుస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ చేయలేని పనిని పూర్తి చేసే కండరాల సమూహంలా మనిషిని చూడటం. ఇది మనుషుల ఆత్మగౌరవాన్ని, పని పట్ల మనుషులకు ఉండే విధేయతని దెబ్బతీస్తుందనేది కాదనలేని నిజం.
ఒకవేళ ఏఐ మనిషిని అద్దెకు తీసుకుని, ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేయిస్తే దానికి ఎవరు బాధ్యులు?
చట్టపరమైన చిక్కులు: ఏదైనా ఏఐ ఏజెంట్ పొరపాటున ఒక సున్నితమైన ప్రాంతాన్ని ఫొటో తీయమని అద్దెకు ఉన్న మనిషిని అడిగితే, ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఏఐ కేవలం సాఫ్ట్వేర్ కాబట్టి దానికి శిక్ష వేయలేం.
బ్లాక్ బాక్స్ డెసిషన్స్: ఏఐ ఎందుకు ఆ పని చేయమని అడిగిందో తెలుసుకోవడం కష్టం కాబట్టి, బాధ్యత అంతా ‘అద్దె మనిషి’ మీదనే పడుతుంది. ఇదో భయంకరమైన సెక్యూరిటీ రిస్క్.
ఈ ప్లాట్ఫామ్లో మనుషులు తమ రేట్లను తామే ఫిక్స్ చేసుకుంటారు. కానీ బాట్లు (Bots) తక్కువ రేటు ఉన్న మనిషినే ఎంచుకుంటాయి. దీంతో మనుషుల మధ్య పోటీ పెరిగి, కూలీ రేట్లు విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే.. ‘ఎవరు తక్కువకు దొరికితే వారు’ అనే పద్ధతిలో మనిషి శ్రమకు విలువ లేకుండా పోయే ప్రమాదం ఉంది. Rentahuman వెబ్‌సైట్‌లోని ‘AI can’t touch grass. You can.’ (ఏఐ గడ్డిని తాకలేదు.. కానీ మీరు తాకగలరు) అంటూ స్లోగన్ కనిపిస్తుంది. ఇక్కడ గడ్డిని తాకడం అంటే ప్రకృతిని ఆస్వాదించడం అని అర్థం. కానీ, ఏఐ ఆ పనిని ఒక ‘టాస్క్’ లాగా మార్చేస్తుంది. అంటే మన స్వేచ్ఛను కూడా కూలిపనిగా మార్చేస్తుందన్నమాట. మొత్తంగా చూస్తే ‘రెంట్ ఏ హ్యూమన్’ లాంటి ఫ్లాట్‌ఫామ్‌లు కేవలం ఒక టెక్ ట్రెండ్ మాత్రమే కాదు. అది ‘హ్యూమన్-యాజ్-ఎ-సర్వీస్’ అనే కొత్త యుగానికి నాందిగా చూడొచ్చేమో!!
– అనిల్ రాచమల్ల ,
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్